అధికారులు తామరాకు మీద నీటిబొట్టులాగా ఉండాలి. ఒక స్థాయి పదవుల్లో ఉండే అధికారులకు చాలా సహజంగా.. రాజకీయ ఒత్తిడులు విపరీతంగా ఉంటాయి. పదవుల్లో ఉన్నప్పుడు అనివార్యంగా కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గవలసి వస్తుంది. అలాంటి వాటిని ఏ ప్రభుత్వమైనా అర్థం చేసుకుంటుంది. వారి కార్యసమర్థతను మాత్రమే దృష్టిలో ఉంచుకుని వారికి భవిష్యత్ రాజకీయ అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. కానీ.. ఒక పార్టీ అధికారంలో ఉండగా.. వారితో అవసరానికంటె ఎక్కువ సన్నిహితంగా మెలగుతూ.. అంటకాగుతూ.. వారి తప్పుడు పనులు అన్నింటికీ ఇతోధికాంగా చేయూత అందిస్తూ.. అవసరమైతే.. ఇంకా ఎన్ని రకాలుగా దోచుకోవచ్చునో తామే సలహాలు కూడా ఇస్తూ చెలరేగిపోయే అధికార్లకు మాత్రం తర్వాత వేరేపార్టీ ప్రభుత్వం వచ్చిందంటే.. ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఐఏఎస్ అధికారిణి డి.హరిత పరిస్థితి ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆమెకు జేసీగా పోస్టింగు ఇచ్చిన ప్రభుత్వం, ఆమె జాయిన్ కాకముందే ఆమె పోస్టింగును రద్దుచేసింది. జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.
ఐఏఎస్ అధికారి హరిత గతంలో తిరుపతిలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి అనేక అవకతవకలకు పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. తిరుపతిలో టిడిఆర్ బాండ్ల రూపేణా వందల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినట్టుగా ఆరోపణలున్నాయి. వాటి వెనుక వైసీపీ నాయకులకు అధికారి హరిత తోడ్పాటు ఉన్నట్టుగా కూడా ఆరోపణలున్నాయి.
ఈ బాగోతంపై ‘‘తానుచూసిన అత్యంత అవినీతిపరులైన అధికారుల్లో హరిత ఒకరని, తిరుపతి కార్పొరేషన్ లో జరిగిన టిడిఆర్ బాండ్ల కుంభకోణానికి సూత్రధారి ఆమేనని’ నెల్లూరు కు చెందిన తెలుగుదేశం నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి ఇటీవల ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పోస్టింగును ప్రభుత్వం రద్దు చేసినట్టుగా తెలుస్తోంది.
గత ప్రభుత్వంకాలంలో వైసీపీ నేతల ఒత్తిడి మేరకు కొంత దారి తప్పి వ్యవహరించిన అధికారులనైనా ఉపేక్షించవచ్చు గానీ.. అవినీతి వ్యవహారాల్లో విచ్చలవిడిగా చెలరేగిపోయిన వారికి మాత్రం తగిన దండన తప్పదని హరిత వ్యవహారంతో సర్కారు నిరూపించినట్టు అయింది.