వైయస్ జగన్మోహన్ రెడ్డి- చంద్రబాబు నాయుడు ను నిందించడానికి, బురద చల్లడానికి.. ఏదో ఢిల్లీలో ఒక దీక్ష చేశారు. ఆ దీక్షకు జాతీయస్థాయి మీడియా అటెన్షన్ రాబట్టడానికి జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నాయకులందరినీ కూడా ఆహ్వానించారు. ఆయనతో ఉండే సంబంధాలను బట్టి ఒకరిద్దరు ముఖ్యమైన నాయకులు కూడా వచ్చారు. అక్కడితో ఆయన సంతోషించి ఊరుకుంటే సరిపోయేది. అలా చేయలేదు. మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి ‘కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో వారిని అడగాలి- వారే తెలుసుకోవాలి’ ఇలాంటి నిందాత్మక డైలాగులు వేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో ఆయన సొంత చెల్లెలు షర్మిల సారథ్యం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇన్ డైరెక్ట్ గా ఆమెకు తగిలేలాగా జగన్ విమర్శలు ఉన్నాయి.
అయితే చెల్లెమ్మతో పెట్టుకుంటే ఆమె ఊరుకుంటుందా? జగన్మోహన్ రెడ్డిని ఒక రేంజ్ లో ఉతికి ఆరేసింది. ఎన్నికలకు ముందే జగన్ మీద తీవ్రమైన విమర్శలతో నిరంతరాయంగా విరుచుకుపడుతూ వచ్చిన వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీని జగన్ నిందించేసరికి ఊరుకోలేకపోయారు. మీ ధర్నాకు అసలు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఆమె ప్రశ్నించారు! మీ పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపటనాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమిందుకా? ఐదేళ్లపాటు భారతీయ జనతా పార్టీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులు ప్రత్యేక హోదాను వారికి తాకట్టు పెట్టినందుకా? అంటూ వైఎస్ షర్మిల- జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా నిరసించారు.
మణిపూర్ ఘటనపై ఇన్నాళ్లు నోరెత్తకుండా ఇప్పుడు మాట్లాడడాన్ని కూడా షర్మిల ప్రశ్నించారు. గతంలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన తీరును తప్పుపట్టారు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ భాజపాకు జై కొట్టడం ద్వారా వైఎస్ఆర్ స్ఫూర్తిని జగన్ చంపేశారని ఆమె విమర్శించారు. ఇలా ఒక రేంజ్ లో ఆమె జగన్ ను ఆటాడుకున్నారు. ఢిల్లీలో దీక్ష చేయడం వెనుక జగన్ స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం లేదని తెలియడం వల్లనే కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలుపలేదని ఆమె వివరించారు.
జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షాల కంటే తీవ్రమైన స్థాయిలో విమర్శించే వారిలో వైఎస్ షర్మిల ముందుంటారు. ఆమెకు గుచ్చుకునేలాగా కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలియజేయకపోవడం గురించి జగన్ మాట్లాడకుండా ఉండాల్సింది అని, దానివల్లనే ఇప్పుడు మరింతగా రెచ్చిపోతున్నారని సొంత పార్టీ వారే అనుకుంటున్నారు.