అధికారంతో కళ్లుమూసుకుపోయి.. వరుస పాపాలకు పాల్పడితే ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఒక కేసులో అరెస్టు అయి రిమాండులో ఉన్న సమయంలోనే.. మరో కేసులో కూడా అరెస్టు కావడమూ.. మరోర రెండు వారాల రిమాండు విధింపబడడమూ ఆశ్చర్యపరిచే విషయమేం కాదు. పోసాని కృష్ణమురళికి బెయిలు దొరికిన తర్వాత అలాంటి సంకటం ఎదురైంది. కానీ.. అంతకంటె ముందే అరెస్టు అయిన వల్లభనేని వంశీకి బెయిలు కూడా దొరక్కముందే మరో కేసులో రిమాండు విధించబడింది. పీటీ వారెంటు మీద ఆయనను తీసుకువచ్చిన పోలీసులు, కోర్టులో హాజరుపరచడమూ, రిమాండు విధించబడడమూ మాత్రమే ప్రధానం కాదు. ఈ విచారణ సందర్భంగా జరిగిన సన్నివేశం, న్యాయమూర్తుల వ్యాఖ్యలు కూడా కీలకమైనవే.
దళితుడిని కిడ్నాప్ చేసి నిర్బంధించి.. తనకు అనుకూలంగా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన కేసులో వల్లభనేని వంశీ అరెస్టు అయి రిమాండులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేసులో ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా.. పోలీసులు మాత్రం.. ఆయనకు బెయిలు ఇస్తే విదేశాలకు పారిపోతారని, సాక్షులను బెదిరిస్తారని, తారుమారు చేస్తారని అంటున్నారు. కాగా.. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని, మరొక కేసులో పీటీవారెంటుపై అరెస్టు చేసి గన్నవరం కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఆ కేసు వివరాలేంటంటే..
కృష్ణాజిల్లాలో ఓ ముస్లిం మహిళ భూమిని, ఆమె కొడుకులని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఆ మహిళతో ఆల్రెడీ తాను కొనుగోలు అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా శ్రీధర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీ ఏ2గా ఉన్నారు. గన్నవరం కోర్టులో హాజరు పరచినప్పుడు.. ఏప్రిల్ 1 వరకు న్యాయమూర్తి ఆయనకు రిమాండు విధించడం జరిగింది.
ఈ సందర్భంగా వంశీ తనకు జైలులో ఇనుప మంచం ఇచ్చారని, పరుపు, ఫైబర్ కుర్చీ ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. దళితుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసు ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఆ కోర్టులో కూడా వంశీ ఈ సదుపాయాల కోసం ప్రత్యేకంగా పిటిషన్ ఆల్రెడీ వేసి ఉన్నారు. ఆ కోర్టులో ఆ అంశంపై విచారణ జరుగుతున్నందున.. తాను వాటిపై ఆదేశాలివ్వలేనని గన్నవరం కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
సంబంధిత కోర్టులోనే ఆ విషయం చూసుకోవాలని సూచించారు. అంతగా ఉంటే.. మెడికల్ రిపోర్టులు సమర్పిస్తే.. ఫైబర్ కుర్చీ ఇచ్చే అవకాశం పరిశీలిస్తాం అని న్యాయమూర్తి అన్నారు.
పాపం.. హంసతూలికా తల్పాలపై పడుకోవడం అలవాటు చేసుకున్న వంశీకి.. జైలులో రిమాండు ఖైదీగా ఇనుపమంచం మీద పడుకోవడం చాలా ఇబ్బంది కరంగా ఉన్నట్టుంది. కానీ పాపం ఏం చేయగలరు..? చేసిన పాపాలు ఒకదాని వెంట మరొకటి వెంటాడుతూ ఉండగా.. ప్రతిదీ అనుభవించాల్సిందే కదా.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.