దాచితే కుదర్దు : కసిరెడ్డికి తండ్రికి నోటీసులు!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో విచ్చలవిడిగా సాగిన మూడువేల కోట్ల రూపాయల అవినీతి పర్వానికి కర్త కర్మ క్రియ అయిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చుట్టూ పోలీసులు తీవ్రంగా ఉచ్చు బిగిస్తున్నారు. ఆయన ఎంతోకాలంగా పరారీలో ఉండగా.. ఇప్పటికే ఆయనకు మూడుసార్లు నోటీసులు పంపిన సిట్ దర్యాప్తు బృందం తాజాగా నాలుగోసారి కూడా నోటీసులు జారీచేసింది. ఈనెల 19న విచారణకు రావాలంటూ.. అతని తల్లిదండ్రుల చేతికి నోటీసుల కాపీ అందించారు. అక్కడితో పోలీసులు ఊరుకోలేదు. 17వ తేదీ విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలంటూ రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి అంతర్ధానం, అజ్ఞాతంలో ఎక్కడకు వెళ్లారనే సమాచారం గురించి ఎన్నిసార్లు ప్రశ్నించినా, వివరాలు కోరినా సహకరించకపోవడం వల్లనే ఆయన తండ్రి కసిరెడ్డికి కూడా విచారణకు రావాలనే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

పరారీలో ఉంటూ రాజ్ కసిరెడ్డి సాగిస్తున్న లావాదేవీల ద్వారా ఆయనను ట్రాక్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పరారయ్యేందుకు ముందు ఆయన చివరిసారిగా ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు.. ఏయే ప్రాంతాల్లో దాక్కుని ఉండే అవకాశం ఉందో వారు ఒక జాబితా కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఆయనకు ప్రస్తుతం ఎక్కడినుంచి డబ్బు సమకూరుతూ ఉండవచ్చో అంచనా వేసి ఆ కోణాల్లో కూడా పరిశోధిస్తున్నారు.
కేవలం రాజశేఖర రెడ్డి మాత్రమే కాదు ఆయన భార్య దివ్యారెడ్డి, ఆమె సోదరి మేఘన ప్రియదర్శిని రెడ్డి కూడా పరారీలోనే ఉన్నారు. వారి ఆచూకీ అయినా దొరుకుతుందేమోనని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరి ఆర్థిక లావాదేవీల గురించి కొంత సమాచారం పోలీసులకు చిక్కిందని దాన్ని బట్టి వారు ఎక్కడ తిరుగుతున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారని అనుకుంటున్నారు.

కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసులకు చిక్కినట్టయితే.. లిక్కర్ స్కామ్ కు సంబంధించి మేజర్ బ్రేక్ త్రూ అవుతుందనే ఆలోచన పోలీసుల్లో ఉంది. ఆయన ద్వారా.. అసలు ఈ కుంభకోణం వెనుక ఎందరున్నారు? ఎవరెరవరు? అంతిమలబ్ధిదారుగా తేలినది ఎవరు? అనే వివరాలన్నీ తెలుస్తాయి. అలాగే మూడువేల కోట్ల అవినీతి జరిగినట్టుగా లెక్కతేల్చిన నేపథ్యంలో ఎవరి వాటా ఎంత అనేది కూడా బయటకు వస్తుందని భావిస్తున్నారు.

రాజ్ తండ్రి ఉపేందర్ రెడ్డి గురువారం విచారణకు హాజరైతే కొన్ని వివరాలు తెలుస్తాయి. అలాగే.. శుక్రవారం విచారణకు విజయసాయిరెడ్డి కూడా రానున్నారు. ఆయన ద్వారా స్కామ్ కు సంబంధించి మరిన్ని సంగతులు బయటకు వస్తాయని అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories