ఆ హామీ ఇస్తే బాబుకు నీరాజనమే!

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇప్పటికే తాము తీసుకుంటున్న అనేక నిర్ణయాల ద్వారా.. ప్రజల్లో చెరగని కీర్తిని, తమ పాలన పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిర్మించుకుంటున్నది. వారూవీరని కాదు.. అన్ని వర్గాల్లోనూ చంద్రబాబు ప్రభుత్వ పాలన పట్ల సమానమైన సంతృప్తి వ్యక్తం అవుతోంది.  చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయనకు తెలియకుండానే.. అత్యంత కీలకమైన ఒక జీవోను విడుదలచేసి, గెజిట్ కూడా తెచ్చిన, జగన్ భక్త అధికారుల దురుసుతనానికి కూడా సీఎం చెక్ పెట్టారు. అలాంటిది.. చంద్రబాబునాయుడు గనుక మరో నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్రంలోని ఉద్యోగ వర్గాలు ఆయనను నెత్తిన పెట్టుకుని నీరాజనం పడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గ్యారంటీడ్ పెన్షన్ స్కీం జీపీఎస్ అనేది ఉద్యోగవర్గాలందరూ మూకుమ్మడిగా వ్యతిరేకించినప్పటికీ.. ప్రభుత్వం బలవంతంగా వారిమీద రుద్దినటువంటి ఆలోచన. పీఆర్సీ పేరుతో.. ఉద్యోగులకు అప్పటిదాకా తీసుకున్న ఫిట్మెంట్ కంటె తక్కువ ప్రకటించి.. వారికి జీతాలు పెంచకపోగా.. ఎక్కువ తీసేసుకున్నారని రికవరీలకు ప్లాన్ చేసిన పాలన జగన్మోహన్ రెడ్డిది. తనను గెలిపిస్తే వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం తెస్తానని మాయమాటలు చెప్పి, ఉద్యోగులను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ వారు తమ డిమాండ్ ను బలంగా వినిపించినందుకు కక్ష కట్టారు. జీపీఎస్ పేరుతో వారందరూ వ్యతిరేకించే ఆలోచన రుద్దడానికి ప్రయత్నించారు. దానికి వ్యతిరేకంగా పోరాడితే కేసులు పెట్టారు. ఆ రకంగా వారి ప్రాథమిక హక్కును కూడా హరించారు.

ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో.. గత ప్రభుత్వ హయాంలో ఆందోళనలు చేసిన రాష్ట ప్రభుత్వ ఉద్యోగులపై కేసులను కూడా ఎత్తివేయాలని వారు కోరుతున్నారు. జీపీఎస్ రద్దుపై పోరాడినందుకే 1500 మంది ఉద్యోగులపై తప్పుడు కేసులు ఉన్నాయని వారు వాపోతున్నారు. జగన్ హయాంలో ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను కూటమి సర్కారు సరిచేయాలని వారు కోరుతున్నారు. మిగిలిన కోరికల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. కనీసం జగన్ బనాయించిన అక్రమ తప్పుడు కేసులను చంద్రబాబు సర్కారు ఎత్తివేస్తే గనుక.. యావత్ ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు త్వరలోనే ఆమేరకు నిర్ణయం తీసుకుంటారని అంతా భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories