పెన్షన్లలో విఫలం అయితే సీఎస్ పై వేటు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పెన్షన్ల వ్యవహారమే హాట్ టాపిక్. వైఎస్సార్ కాంగ్రెస్ కు కొమ్ము కాయడమే జీవితధ్యేయంగా పనిచేస్తున్న వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించడం ఒక కీలక వ్యవహారం. దానిని అధికార విపక్ష పార్టీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా వాడుకోవడానికి, ఆ ఆదేశాలనుంచి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇదంతా చంద్రబునాయుడు పుణ్యమే అని, ఆయన వల్లనే పేదలకు పెన్షన్లు అందకుండా పోతున్నాయని, సచివాలయాలకు వెళ్లి తీసుకోవాల్సి వస్తుందని చంద్రబాబును నిందించడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా అనేక అనుబంధ ప్లాన్ లను కూడా సిద్ధం చేసింది. అయితే.. వైసీపీ వారి కుట్రల ఫలితంగా.. ఈ పెన్షన్ల పంపిణీ పూర్తయ్యే సమయానికి దక్కే అపకీర్తి వలన.. సీఎస్ జవహర్ రెడ్డిపై వేటు పడే ప్రమాదం పొంచి ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వైఎస్సార్ సీపీ ప్రధాన వ్యూహం ఏంటంటే.. పెన్షన్లు వీలైనంత వరకు అందకుండా చూడాలి. అలా సాధ్యం కాదు గనుక.. పెన్షన్లు అందజేయడంలో వీలైనంత జాప్యం జరగాలి. వీలైనంత గందరగోళం కూడా జరగాలి. సచివాలయాల వద్దకు పెన్షనర్లువస్తే వారికి వెంటనే పెన్షన్లు ఇవ్వకుండా, పోనీ వేచి ఉండడానికి కాస్త నీడ కూడా ఏర్పాటు చేయకుండా, మంచినీళ్లు కూడా అందకుండా రకరకాలుగా వేధించాలి. వారిని అష్టకష్టాల పాల్జేయాలి. వారు పెన్షన్ల కోసం పడుతున్న కష్టాలన్నింటికీ.. చంద్రబాబునాయుడే కారణం అని ప్రచారం చేయాలి. తద్వారా.. ఆయన మీద ద్వేషం పుట్టించడానికి ప్రయత్నించాలి. అదే సమయంలో.. పెన్షన్లు పొందడంలో గందరగోళం తామే క్రియేట్ చేసి, తమ మీడియా సంస్థల ద్వారా.. ఆందోళన చెందుతున్న పెన్షనర్లతో వాయిస్ లు రికార్డు చేయించి.. టీవీ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించాలి. చంద్రబాబును బాగా తిట్టించాలి.. ఇన్ని రకాల ప్లాన్ లతో వైసీపీ సిద్ధం అవుతోంది.

కానీ ఇలా జరిగితే గనుక.. పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం దారుణంగా విఫలం కావడం కిందికి వస్తుంది. పైగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు మేలు చేయడానికే.. వాలంటీర్లు లేకుండా.. పెన్షన్లు ఇవ్వడం సాధ్యం కాదని కుట్రపూరితంగా చాటి చెప్పడానికే ప్రభుత్వయంత్రాంగం చేసినపనిగా ఇది కనిపిస్తుంది. అంతిమంగా… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. తదనుగుణంగా ఇలాంటి కుట్రల వెనుక సీఎస్ పాత్ర లేదా, అధికార పార్టీ కుట్రలకు సీఎస్ సహకారం గురించి కూడా తెలుగుదేశం తరఫునుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి. ఇలాంటి జాప్యాలు జరిగినట్టయితే, ప్రజల్లో ఆందోళన పుట్టినట్టుఅయితే ఈసీ సీఎస్ మీద వేటు వేసే అవకాశంకూడా పుష్కలంగా ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories