ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దిష్టమైన గడువులు నిర్దేశించుకుని.. ఆ మేరకు లక్ష్యసాధనకు పరిశ్రమించే వ్యక్తి.. తన టీం లో పని పట్ల నిర్లక్ష్యాన్ని ఆయన సహించరు. అందుకే పోలవరం డామ్ సందర్శన సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు.. గైర్హాజరైన కాంట్రాక్టరు పట్ల ఆయన గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయకుంటే.. అందుకు బాధ్యులు అయిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడానికి వెనుకాడేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. అయిదేళ్లుగా మందగమనం అలవాటు అయిపోయిన కాంట్రాక్టర్లలో ఏ కొంతైనా అలసత్వం పేరుకుని ఉంటే వారిని అదిలించి.. పనిలోకి దించేలా ఆయన హెచ్చరికలు ఉన్నాయి.
ఒక లక్ష్యం ప్రకారం అడుగులు వేస్తున్నప్పుడు అందుకు అందరి సహకారం కావాల్సి ఉంటుంది. ఏ ఒక్కరో సంకల్పించినంత మాత్రాన ఇలాంటి బృహత్ కార్యాలు నెరవేరవు. తన సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో ఆ సత్యం తెలుసుకున్న వారు గనుకనే చంద్రబాబు చంద్రబాబు ఆ స్థాయిలో బెదిరించినట్టు తెలుస్తోంది.
అమరావతి రాజధానిని ఈ అయిదేళ్ల వ్యవధిలోగా పూర్తిచేసి ఒక నిర్దిష్టమైన రూపురేఖలు తీసుకురావాలని ఏ రకంగా అయితే చంద్రబాబు అనుకుంటున్నారో.. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా అంతకంటె పట్టుదలగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. సెల్ఫ్ సస్టయినబుల్ ప్రాజెక్టు అయిన అమరావతి విషయంలో నిధుల కోసం రుణాలు చేస్తున్నారు గానీ.. పూర్తి కేంద్రప్రాజెక్టు అయిన పోలవరం డ్యాం విషయంలో ఆ చింత కూడా లేదు. ఈ దఫా కేంద్ర ప్రభుత్వం పోలవరం డ్యామ్ పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో తమ సహకారం అందించే ఉద్దేశంతో ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తూ వస్తోంది. నిధుల కొరత అస్సలు లేదు. కాకపోతే పనులు పూర్తిచేయించడం ఒక్కటే ప్రభుత్వ బాధ్యత. అందుకే చంద్రబాబు మరింత ఉత్సాహంగా పోలవరం పనులను నడిపించాలని చూస్తున్నారు. 2027 నాటికి డ్యామ్ పూర్తి చేస్తాం అని, 2026 నాటికి పునరావాసం పనులు, వారికి అందించే సాయం మొత్తాలతో సహా పూర్తిచేస్తామని, 2025 సంవత్సరాంతానికే నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 49 కాలనీల పనులు కూడా పూర్తవుతాయని చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నారంటే.. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, అధికారుల మీద నమ్మకంతోనే కదా! మరి అలాంటప్పుడు వారిలో అలసత్వం కనిపిస్తే ఆగ్రహం రాకుండా ఉండదు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి పనుల పరిశీలనకు సమీక్షకు వచ్చినప్పుడు.. పోలవరం డ్యామ్ తాలూకు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు అందరూ హాజరు కావాల్సిందే. కాలువల పనులు అనుకున్నట్టుగా జరగడం లేదని విచారిస్తుండగా.. ఎడమ కాలువలో ఒక ప్యాకేజీకి సంబంధించిన కాంట్రాక్టరు హాజరు కాలేదని చంద్రబాబు దృష్టికి వచ్చింది. దాంతో ఆయన ఇలాంటి అలసత్వ ధోరణి పనుల విషయంలో ప్రదర్శిస్తే అనుకున్నట్టుగా పనులు పూర్తిచేయకపోతే.. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతానని హెచ్చరించారు. ఇలాంటి హెచ్చరికలు అవసరమే అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.