ఒక పార్టీలో ఒక నియోజకవర్గంలో ఒకే స్థాయి కలిగిన నాయకులు ఇద్దరు లేదా అంతకంటె ఎక్కువ ఉంటే ముఠా తగాదాలు అనేది చాలా సాధారణమైన సంగతి. పార్టీ అధినేతలు కూడా.. ఎన్నికల సమయంలో.. నాయకుల మధ్య సయోధ్యకు ప్రయత్నించి.. పార్టీ ఓడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.. ఆ తర్వాత ఆ నాయకుల వ్యవహారాల్లో మరీ ఎక్కువగా జోక్యం చేసుకోరు. కానీ.. ఆ ముఠాతగాదాలు శృతిమించి.. పార్టీ పరువు తీసే పరిస్థితి ఏర్పడితే.. అధినేతలు జోక్యం చేసుకోవాల్సిందే. ఇప్పుడు తెలుగుదేశం అధిష్ఠానం.. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని నాయకుల తగాదాల మీద దృష్టి సారించాల్సిన అవసరం అలాగే కనిపిస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే దగ్గుమళ్ల ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ముదిరిన వైరం ఇప్పుడు పార్టీనే దెబ్బతీసేలా కనిపిస్తోంది.
ఈ ఇద్దరు నాయకులు బజార్న పడి కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్టుగా తగాదా పడుతున్నారు. ఎమ్మెల్యే ప్రసాదరావు అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని.. ప్రభాకర్ చౌదరి బాహాటంగానే ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో.. ఎమ్మెల్యే ప్రసాద్ కూడా.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గతంలో చేసిన అవినీతి గురించి ఎడాపెడా ప్రస్తావిస్తున్నారు. వీరిద్దరూ రెచ్చిపోయి ఒకరి పరువు ఒకరు తీసుకుంటున్నట్టుగా అనంతపురం రాజకీయాలు తయారయ్యాయి. ఈ తగాదాలు పార్టీకే ప్రమాదకరంగా మారుతున్నాయి.
తనకు టికెట్ రాకుండా గద్దలా వచ్చి తన్నుకుపోయాడని ప్రసాదరావు మీద ప్రభాకర్ చౌదరికి తొలినుంచి వైరం ఉంది. ఎన్నికల సమయంలో.. చంద్రబాబునాయుడు చెప్పారు గనుకనే.. తాను సహకరించానని లేకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేదో తెలిసేది అంటూ చౌదరి అంటున్నారు. దమ్ముంటే ఇప్పుడైనా సరే.. పదవికి రాజీనామా చేసేసి రా.. నేనుకూడా పార్టీని వీడి బయటకు వస్తాను. ఇద్దరమూ ఇండిపెండెంట్లుగా పోటీచేద్దాం.. ఎవరి సత్తా ఏపాటిదో తేల్చుకుందాం..అంటూ ప్రభాకర్ చౌదరి సవాళ్లు విసురుతున్నారు. ఇలాంటి సవాళ్లు ఎవరూ స్వీకరించేది జరగదు గానీ.. పార్టీ పరువు పోవడం మాత్రం గ్యారంటీ అని కార్యకర్తలు బాధపడుతున్నారు.
ఈ ఇద్దరు నాయకుల మధ్య విభేదాలను సర్దుబాటు చేయడానికి, క్రమశిక్షణ మీరి బహిరంగంగా మాట్లాడకుండా ఉండేలా టీడీపీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాల్సి ఉందని వారు కోరుకుంటున్నారు.