కోర్టుకు వెళ్లకుంటే పొన్నవోలు బెదిరింపులు వృథా!

రాష్ట్రప్రభుత్వపు అదనపు అడ్వకేట్ జనరల్ గా వైఎస్సార్ కాంగ్రెస్  హయాంలో పనిచేసిన పొన్నవోలు సుధాకర రెడ్డి  ఇప్పుడు ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి కూడా! ఆయన గురువారం నాడు సజ్జల రామక్రిష్ణారెడ్డిని పోలీసు విచారణకు పిలిచినప్పుడు తాను కూడా వెంట వెళ్లాలని అనుకున్నారు. కానీ ఆయన ప్రయత్నం ఫలించలేదు. సజ్జలను మాత్రమే విచారణ నిమిత్తం లోనికి అనుమతిస్తాం అని.. ఆయన వెంట న్యాయవాదిని కూడా అనుమతించాలంటే ప్రత్యేకంగా కోర్టు అనుమతి తెచ్చుకోవాల్సిందేనని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. సజ్జలతో కలిసి లోనికి వెళ్లిన పొన్నవోలును బయటకు వెళ్లాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. సహజంగానే పొన్నవోలు సుధాకరరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు.

పోలీసులు నిబంధనలు ఎలా ఉంటే అలా వ్యవహరిస్తారు. అంతకు మించి వారి చేతిలో ఏమీ ఉండదనే సంగతి సీనియర్ న్యాయవాది అయిన పొన్నవోలు సుధాకరరెడ్డికి తెలియకుండా ఉండదు. కానీ.. కోర్టు అనుమతి లేకపోతే సజ్జల వెంట అనుమతించడానికి వీలు కాదని చెప్పడంతో ఎస్సై మీద పొన్నవోలు నిప్పులు చెరిగారు. ‘నన్నే బయటకు వెళ్లమంటావా? మాకూ ఓ రోజు వస్తుంది. అప్పుడు మీ సంగతి చెబుతా’ అంటూ  పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసులు చట్టాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేస్తున్నారని ఆరోపణలు చేశారు.

కేసులో నిందితుడిగా పేరు చేరిన తర్వాత, విచారణకు రావాల్సిందిగా పిలవడం పోలీసుల హక్కు అని, ఆ హక్కును తాము ప్రశ్నించడం లేదని అన్నారు. అదే విధంగా విచారణకు హాజరయ్యే వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఉంటాయని, న్యాయవాదిని వెంట తీసుకువెళ్లడానికి ఉండే హక్కును పోలీసులు కాలరాశారని మీడియాతో పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక రాష్ట్రప్రభుత్వానికి ఏఏజీగా కూడా సేవలందించిన ఈ సీనియర్ న్యాయవాదికి న్యాయనిబంధనలు తెలియకుండా ఉండవు. న్యాయవాదిని వెంట తీసుకువెళ్లడం నిందితుడి హక్కు అనేది నిజమే కావొచ్చు. దానిని మంగళగిరి పోలీసులు కాలరాయడం నిజమే కావొచ్చు. మరి ఈ విషయంలో పొన్నవోలు ఏం చేయబోతున్నారు. కేవలం ఎస్సై మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఊరుకుంటున్నారా? లేదా మంగళగిరి పోలీసులు చట్టాన్ని పరిహసించిన తీరును లీగల్ గా నిలదీయబోతున్నారా?

సజ్జల రామక్రిష్ణారెడ్డి తోపాటు ఆయన న్యాయవాదిగా తనను విచారణకు అనుమతించకపోవడం పోలీసుల దుర్మార్గంగా కేవలం మీడియా ముందు అభివర్ణించడం మాత్రమే కాదు. ఆ విషయంపై ఆయన కోర్టును ఆశ్రయిస్తేనే బాగుంటుంది. ఇలాంటి పోలీసుల దుశ్చర్యలు ఇతర నిందితుల విషయంలో పోలీసులు మళ్లీ మళ్లీ రిపీట్ చేయకుండా ఉంటుంది. పోలీసుల దుర్మార్గం సర్వత్రా చర్చకు వస్తుంది. పొన్నవోలు సుధాకర రెడ్డి తనను సజ్జల వెంట అనుమతించకపోవడం గురించి హైకోర్టులో పిటిషన్ వేయాలని  ప్రజలు కోరుకుంటున్నారు. అలా చేయకపోతే గనుక.. ఆయన మంగళగిరి పోలీసు స్టేషన్ వద్ద చేసిన హడావుడి, పోలీసుల మీద ఆగ్రహం అన్నీ వృథా అవుతాయి. అక్కడేదో బెదిరించి పని నెరవేర్చుకోవాలని అనుకున్నారే తప్ప.. వాస్తవంలో పోలీసుల తీరే కరక్టేనేమో అని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. పోలీసులు నిజంగానే తప్పు చేశారని భావిస్తే గనుక.. పొన్నవోలు ఖచ్చితంగా కోర్టుకు వెళ్లి వారి వైఖరిని ఎండగట్టాలి. లేకపోతే.. ఇక ఎప్పుడూ ఇలాంటి బూటకపు ఆవేశాన్ని ప్రదర్శించకుండా సైలెంట్ గా ఉంటే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories