రాజకీయ అండదండలు చూసుకుని అత్యుత్సాహం ప్రదర్శించడం నిబంధనలు పట్టించుకోకపోవడం.. తమకు ఎదురేలేదని ఇష్టారాజ్యంగా చెలరేగిపోవడం.. జరిగితే ఎంతటి వారికైనా ఏదో ఒక నాటికి ఎదురు దెబ్బ తప్పదు. ఇతర నాయకులు అయినా, ప్రైవేటు వ్యక్తులు అయినా, ఆశ్రమాలు పీఠాధిపతులు అయినా, ఎవరైనా సరే చట్టానికి నిబంధనలకు లోబడి వ్యవహరించేంతవరకు మాత్రమే వారికి గౌరవం దక్కుతుంది. రాజకీయ నాయకుల ప్రాపకం కోరుకుంటూ వారి ముఖప్రీతి కోసం పనిచేస్తూ వారి అండ చూసుకొని తప్పుడు పనులు చేస్తే ఎదురు దెబ్బలు తినాల్సిందే.
ఇప్పుడు విశాఖపట్నానికి చెందిన శారదా పీఠానికి అలాంటి చిక్కులే వచ్చి పడుతున్నాయి. జగన్ అండ చూసుకొని విద్యాస్వరూపానందేంద్ర కారుచవకగా భూములు కాజేసిన దోపిడీని చంద్రబాబు సర్కారు అడ్డుకున్న సంగతి అందరికీ తెలుసు. ఆ భూముల లీజును ఆల్రెడీ రద్దు చేశారు. తాజాగా ఇదే శారదాపీఠం తరఫున తిరుమలలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఐదువేల చదరపు అడుగుల స్థలాన్ని తిరుమల గోగర్భం గ్రామ సమీపంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో శారదాపీఠం వారికి 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. నిబంధనలన్నింటినీ అతిక్రమించి దాదాపు 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టడం అంటే ఎంతగా ఉల్లంఘించారో అర్థమవుతుంది. అయితే వారు అలా చెలరేగిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వంగానీ టీటీడీ గానీ అడ్డుకోలేదు. పైగా జగన్ వచ్చిన తర్వాత వారి విచ్చలవిడితనం ఇంకా పెరిగింది.
తమకు అనుమతులు ఉన్న ప్రాంతం కాకుండా.. ఇంకా కొద్ది స్థలాలను ఆక్రమించుకొని మరీ నిర్మాణాలను చేపట్టింది. అడ్డదారిలో నిర్మాణాలు మొదలుపెట్టిన తర్వాత అనుమతులు కోసం టీటీడీ బోర్డు కు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందారు. ఈ క్రమంలో టీటీడీ భూమిని కూడా విచ్చలవిడిగా ఆక్రమించారు. అయితే ఈ అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడం ద్వారా ఇలాంటి అరాచకాలను అరికట్టాలని.. భవిష్యత్తులో ఇలాంటి తప్పులకు పాల్పడే వారికి హెచ్చరిక కూడా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డితో అనైతిక బంధంతో చెలరేగిన శారదా పీఠానికి ఇది రెండో ఎదురు దెబ్బ!