ఎంతో విశ్వసనీయుడైన మిథున్ రెడ్డిని పరామర్శించడానికే దిక్కులేదు. చెవిరెడ్డి జైలు పాలైతే గుంటూరులోనే ఉంటూ అటు దిక్కు కూడా వెళ్లడం లేదు. మరి మనలాంటి సామాన్య కార్యకర్తలకు కష్టం వస్తే.. ఈ జగన్మోహన్ రెడ్డి కాపు కాస్తారా? లేదా.. మన మానాన మనల్ని వదిలేసి.. మీ చావు మీరు చావండి అని ఊరుకుండిపోతారా? అనే భయం ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో బీభత్సంగా వ్యక్తం అవుతోంది. ఈనెల 25 వ తేదీన.. మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలవడానికి రాజమహేంద్రవరం జైలుకు వెళ్లడానికి డిసైడ్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ పార్టీని నమ్ముకుంటే తమకు అథోగతే అనే భయం వారిలో కలుగుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మనం మిథున్ రెడ్డి కంటె ప్రముఖులమా? మిథున్ రెడ్డి కంటె జగన్ కు ఆత్మీయులమా? అలాంటిది.. మిథున్ రెడ్డి కష్టంవస్తే విచారించడానికి, చూడడానికే జగన్ వెళ్లడం లేదు. ఇక మనబోటి సామాన్యుల సంగతి ఏమిటి? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమలో తాము చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే.. గత ఏడాది కాలంగా సజ్జల రామక్రిష్ణారెడ్డి వంటివాళ్లు కార్యకర్తలతో సమావేశాలలో తమకు చేస్తున్న హితబోధలు, కర్తవ్యబోధలు వారికి గుర్తుకు వస్తున్నాయి.
సజ్లల మాటల్ని గుర్తు చేసుకుంటే.. ‘‘మీరు ప్రభుత్వం మీద తిరగబడండి.. కేసులు పెట్టించుకోండి.. ఎవరు ఎన్ని కేసులు ఎక్కువగా పెట్టించుకుంటే వారికి అంతగా పార్టీ భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తుంది. జగనన్న 2.0 ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎక్కువ కేసులు పెట్టించుకున్న వారికే అగ్రప్రాధాన్యం లభిస్తుంది. కేసులకు ఏమాత్రం భయపడకండి.. మీమీద కేసులు పెడితే.. మన న్యాయవిభాగం వారి ద్వారా సలహాలు ఇస్తాం..’’ అంటూ రకరకాల మాటలు సజ్జల చెబుతూ ఉంటారు.
ఆ మాటల అంతరార్థం ఏమిటో కార్యకర్తలకు ఇప్పుడు తెలుస్తోంది. కేసులు పెట్టించుకోండి.. పెట్టించుకోండి.. అంటే.. కేసుల్లో బుక్కయిన వారిని కనీసం పట్టించుకోవడం లేదే.. అని భయపడుతున్నారు. మిథున్ రెడ్డికి, జగన్ మోహన్ రెడ్డి పట్ల అతి వినయవిధేయతలతో దాదాపు ఊడిగం చేస్తూ వచ్చిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి లాంటి వాళ్లను కూడా ఇప్పటిదాకా పరామర్శించడానికి కూడా వెళ్లని జగన్మోహన్ రెడ్డి.. ఇక తమబోటి వాళ్ల విషయంలో ఏమాత్రం స్పందిస్తారనే సందేహం వారందరిలోనూ ఉంది.
ఆల్రెడీ ముద్ర పడిపోయాం గనుక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉండక తప్పదు.. ఏదో నాయకులు పిలిచి డబ్బులు ఇస్తే ఏదైనా కార్యక్రమాలకు వెళదాం.. లేకపోతే ఊరుకుందాం.. ఓవరాక్షన్ చేసి కేసుల్లో ఇరుక్కుంటే మనకు దిక్కుండదు అనే భయానికి వారంతా గురవుతున్నట్టు సమాచారం.