ఏపీపీఎస్సీ కుంభకోణంలో ప్రధాన నిందితులు అయిన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం కటకటాల్లో రిమాండులో ఉన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు ఒకరు కాగా, ఏపీపీఎస్పీ నుంచి మూల్యాంకనానికి కాంట్రాక్టు పుచ్చుకుని కారు డ్రైవరు భార్యలు, తదితర అనామకులతో ఆ పనిని తూతూమంత్రంగా పూర్తిచేయించిన క్యామ్ సైన్ సంస్థ డైరక్టర్ పమిడికాల్వ మధుసూదన్ మరొకరు. అయితే వాస్తవంగా జరిగిన పాపం ఏమిటి? అనేది ఇంకా నిగ్గు తేలలేదు. ఈ ఇద్దరినీ ఇప్పటికే పోలీసులు విడివిడిగా విచారించారు. అయితే జమిలిగా కూడా విచారించడానికి పోలీసులు కోర్టునుంచి అనుమతి పొందరు. కీలకనిందితులైన ఈ ఇద్దరినీ కలిపి ఏకకాలంలో విచారిస్తే చాలా వివరాలు బయటకు వస్తాయని అనుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినప్పుడు డిజిటల్ మూల్యాంకనంలో బోలెడు అక్రమాలు జరిగినట్టుగా ఫిర్యాదులు వచ్చాయి. హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం చేయించాల్సి వచ్చింది. ఇక్కడే అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు అన్ని అక్రమాలకు తెరతీశారు. క్యామ్ సైన్ మీడియా అనే సంస్థకు మూల్యాంకనం కాంట్రాక్టు ఇచ్చారు.
యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్ల ప్యానెల్ నుంచి ఎంపిక చేసిన వారితో మాత్రమే చేయించాల్సి ఉండగా.. ఆ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చేశారు. పైగా ఏపీపీఎస్సీ ఆఫీసులో గానీ, కాలేజీల్లో గానీ కాకుండా.. హాయ్ ల్యాండ్ లో గదులు అద్దెకు తీసుకుని మూల్యాంకనం ప్రక్రియ అక్కడ, నిబంధనలకు విరుద్ధంగా, నడిపించారు. డిజిటల్ లో వచ్చిన మార్కులనే.. కొంచెం అటు ఇటుగా మాన్యువల్ విధానంలో వచ్చినట్టుగా అక్కడ వేసేయాలని పురమాయించారు. క్యామ్ సైన్ తరఫున పమిడికాల్వ మధుసూదన్ తమ సంస్థలో పనిచేసేవారిని, రకరకాల అర్హత లేని వ్యక్తులను మాట్లాడుకుని వారితో ఆ పనిచేయించారు. ఇదంతా తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ మూల్యాంకనం పనిచేసినందుకు క్యామ్ సైన్ సంస్థకు 1.17 కోట్ల రూపాయలు ఒకే చెక్కుగా చెల్లింపులు చేసినట్టుగా కూడా గుర్తించారు.
అయితే పీఎస్సార్ ఆంజనేయులు ఇంత దుర్మార్గమైన తీరులో ఎందుకు వ్యవహరించారు. ఎవరికోసం ఇన్ని తప్పులు చేశారు.. ఎవరి పురమాయింపు మేరకు అక్రమాలకు పాల్పడ్డారు అనేది లెక్కతేలలేదు. ఆయన ఈ కేసులో ప్రధాననిందితుడిగా అరెస్టు అయ్యారు. అలాగే మధుసూదన్ ను తర్వాత అరెస్టు చేసారు. ఇప్పుడు వీరిద్దరినీ కూడా రెండు రోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకుని విచారించడానికి న్యాయస్థానం అనుమతించింది. ఆ విచారణంలో కొన్ని వివరాలు బయటకు రావచ్చునని పలువురు భావిస్తున్నారు.