జగన్మోహన్ రెడ్డి అధికారం వెలగబెట్టిన అయిదేళ్ల కాలంలో ప్రభుత్వం లోని పెద్దలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం.. అధికారుల తోడ్పాటు లేకుండా సాధ్యమయ్యే వ్యవహారం కాదు. ఆ రకంగా వైసిపి నేతలు అక్రమాలకు జై కొట్టిన ఉన్నతాధికారులు ఇప్పుడు ఒక్కరొక్కరుగా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడుతున్నారు. తాజాగా గనులు ఖనిజాల శాఖకు గతంలో ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి ని విచారించేందుకు ఏసీబీ పోలీసులు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. ఆల్రెడీ సస్పెన్షన్ కు గురైన వెంకటరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన దొరికి, విచారిస్తే గనుక.. ఆయనను పాత్రధారిగా ఆడిస్తూ అసలు షో నడిపించిన తెరవెనుక సూత్రధారులు ఎవరో తెలుస్తుంది. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. వైసిపి లో జగన్ తర్వాత అంతటి కీలక నేతగా చక్రం తిప్పిన నెంబర్ టూ నాయకుడు కేసులో ఇరుక్కుంటారని తెలుస్తోంది.
గనుల లీజు కేటాయింపు, ఇసుక టెండర్ల ఖరారు, ప్రభుత్వానికి బకాయి ఉన్న సంస్థలకు కూడా ఎన్వోసి జారీ కావడం వంటి అనేక రకాల ఆరోపణలు వెంకటరెడ్డిపై ఉన్నాయి. ఇసుక కాంట్రాక్టర్. జేపీ పవర్ వెంచర్స్ ప్రభుత్వానికి 800 కోట్ల బకాయి ఉన్నప్పటికీ వారికి ఎన్వోసి ఇచ్చేశారు. అలాగే జేసీ కేసీ, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలు నిబంధనలు ఉల్లంఘించడం వెనుక వెంకటరెడ్డి హస్తం ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఈ సంస్థలన్నీ అప్పటి ప్రభుత్వంలో నెంబర్ టూ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బినామీల సంస్థలే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి విచారణ ముందుకు సాగితే పెద్దిరెడ్డి పాత్ర కూడా బయటకు వస్తుంది! ఆయనను విచారించడానికి సంబంధించి ఏసీబీ పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తోంది.
అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడినతర్వాత సుమారు రెండు నెలలనుంచి వెంకటరెడ్డి పరారీలో ఉన్నారు. పరారీలో వుండగానే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆగస్టు 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే సస్పెన్షన్ లో ఉండడం వల్ల అది సాధ్యం కాదు. సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వడానికి వెళ్లిన అధికారులకు కూడా ఆయన దొరకలేదు. పరారీలోనే ఉన్నారు. ఆయన దొరికితే మాత్రం వైసిపి లోని పలువురు పెద్దల అక్రమాలు వెలుగులోకి వస్తాయని అంతా అనుకుంటున్నారు.