ఈ విచారణ తేలితే వైఎస్ అవినాష్ అండ్ కో కు గండమే!

వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించిన కేసు విచారణ చాలాకాలంగా స్తబ్ధంగా, కేవలం కోర్టుకు మాత్రమే పరిమితమై కనిపిస్తున్నప్పటికీ.. ఈ విషయంలో పాపభారాన్ని మోస్తున్న కీలక నిందితులు, ప్రధానంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ కో అప్పుడే పూర్తిగా సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టు అనుకోవడానికి వీల్లేదని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

ఈ కేసులో నిందితులకు మంజూరు చేసిన అన్ని బెయిలు పిటిషన్లను రద్దు చేయాలని కోరుతూ.. వైఎస్ వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈకేసు తదుపరి వాయిదా సెప్టెంబరులో ఉంది. ఆ వాయిదా నాటికి ఏ సంగతీ తేలుతుందో లేదో తెలియదు గానీ.. ఇప్పుడు ఈ కేసుతో ముడిపడిన మరో కేసులో తాజాగా మొదలైన విచారణ వల్ల.. వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ కో కు గండం తప్పదని పలువురు భావిస్తున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితు అందరూ ఇప్పుడు జైలు బయటే ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి కీలకనిందితుడే అయినప్పటికీ.. ఇప్పటిదాకా జైలుకు వెళ్లకుండానే బెయిలుపై మేనేజ్ చేస్తున్నారు. అదే సమయంలో.. ఆయన తండ్రి వైఎస్ భాస్కర రెడ్డి, ఆత్మీయుడు శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ప్రధాన నిందితుడు గంగిరెడ్డి తదితరులు అందరూ కూడా బెయిలుపై బయటే ఉన్నారు. వీరిలో ఏ1 నిందితుడు గంగిరెడ్డికి కొన్ని రోజుల కిందటే బెయిలు వచ్చింది. మిగిలిన అందరూ బయటే ఉండగా.. ఆయన ఒక్కడినీ లోపల ఉంచడం భావ్యంకాదనే వాదన మీద ఆయన బయటకు వచ్చారు.

అయితే.. ఒక నిందితుడు దస్తగిరి కడప సెంట్రల్ జైలులో ఉండగా.. ఆయన బెదిరించడానికి, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించుకోవడానికి వైఎస్ అవినాష్ రెడ్డి మనుషులు ప్రయత్నించారంటూ నమోదైన కేసులో తాజాగా విచారణ ప్రారంభం అయింది. ఈ కేసులో ఆరోపణలు నిజమే అని తేలితే గనుక.. వీరందరి బెయిళ్లు గంపగుత్తగా రద్దవుతాయని పలువురు భావిస్తున్నారు.

దస్తగిరి కడప జైల్లో ఉండగా.. వివేకాహత్యకేసులో కీలక నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి 2023లో జైలులో మెడికల్ క్యాంపుపేరుతో వెళ్లి.. దస్తగిరిని బెదిరించినట్టుగా ఆరోపణలున్నాయి. తమకు అనుకూలంగా పోలీసులతో చెప్పకపోతే.. చంపుతామని బెదిరించారని సమాచారం. ఈ ఆరోపణల మీద వాస్తవాలు తేల్చేందుకు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్  ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో ఒక బృందం ఏర్పాటుచేశారు. వారు తాజాగా విచారణ ప్రారంభించారు. జైలు సూపరింటెండెంట్, సిబ్బందిని ఎస్పీ ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో ఈ విచారణలో ఆరోపణలు నిజమే అని తేలితే గనుక.. వీరందరి బెయిళ్లు రద్దవడం గ్యారంటీ. జైలులో ఉండగానే.. బయట సాక్ష్యాలను తారుమారు చేయడానికి బెదిరింపుల పర్వం నడిపించిన వారు.. ఇప్పుడు బయట ఉంటే ఇంకెంతగా చెలరేగిపోతారో కదా అనే వాదన తెరపైకి వస్తుంది. సో, అవినాష్ రెడ్డి అండ్ కో కు పెద్ద గండమే పొంచి ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories