వారికి వెయ్యి ఓట్లు రాకుంటే రిగ్గింగ్ అనొచ్చు!

కడపజిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికకు ఇవాళ కౌంటింగ్ జరగబోతోంది. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే మమ్మల్ని అసలు ఓట్లే వేయనివ్వలేదని..  ఒక్కో పోలింగ్ కేంద్రానికి 800 మంది వరకు బయటి ప్రాంతాల వారు తరలివచ్చి తమ ఓట్లన్నీ వేసుకున్నారని రకరకాల ఆరోపణలు చేస్తున్నది వైసీపీ. ఇవాళ కౌంటింగ్ పూర్తయ్యేసరికి.. ఆ పార్టీకి వెయ్యి ఓట్లు కూడా రాకపోతే మాత్రం.. వారు చేస్తున్న ఆరోపణలు నిజమే అని అనుకోవచ్చు. ఏమాత్రం గణనీయంగా ఓట్లు వచ్చినా.. వారు చేసినవి అన్నీ పసలేని ఆరోపణలు, అభూత కల్పనలు అని నమ్మాల్సి వస్తుంది.
తెలుగుదేశం పార్టీ వారు పోలీసులను అడ్డు పెట్టుకుని మొత్తం దొంగఓట్లు వేయించుకున్నారు అని వైసీపీ నాయకులు ఎన్ని రకాల ఆరోపణలు చేసారో లెక్కలేదు. అసలు పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజంట్లను కూర్చోబెట్టకుండా, లోనికి పంపకుండా ఉండిపోవడమే కాకుండా.. తమ ఏజంట్లు లేకుండా అసలు పోలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు జగన్. పోలింగ్ పూర్తయిన తర్వాత.. ఫార్మ్ 32 మీద ఏజంట్లు సంతకం పెట్టాలి కదా.. మా వాళ్ల సంతకాలు  లేవు కదా అంటున్నారు. జగన్ అక్కడే పప్పులో కాలేస్తున్నారు. వారి పార్టీ ఏజంట్లు పలాయనం చిత్తగించారు. మొత్తం 11 మంది అభ్యర్థుల్లో కనీసం ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల ఏజంట్ల సంతకాలు కూడా లేకుండా ఫార్మ్ 32 పూర్తిచేసి ఉంటే గనుక.. అప్పుడు తప్పు పట్టవచ్చు. వీళ్లు పారిపోయి.. మా సంతకాలు లేవు కదా అని నిలదీయడం బుద్ధిహీనత అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్ గానీ, అవినాష్ రెడ్డి గానీ, ఏ ఇతర వైసీపీ నాయకులు గానీ ఒక్కటే పాట పాడుతున్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో మమ్మల్ని ఓటు వేయనివ్వలేదు. ప్రజలందరినుంచి ఓటరు స్లిప్పులు లాక్కున్నారు. అన్ని ఓట్లు తెలుగుదేశం వాళ్లే వేసుకున్నారు. అని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. బయటిప్రాంతాలనుంచి తరలివచ్చిన వందల మంది ఓట్లు వేసేసారని బురద చల్లుతున్నారు. వాళ్లు చెబుతున్నదే నిజమైతే గనుక.. పోలైన మొత్తం ఓట్లన్నీ తెలుగుదేశానికే పడాలి. ఫరెగ్జాంపుల్ పులివెందుల మండలంలో మొత్తం 10వేల పైచిలుకు ఓట్లకు గాను 8102 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ ఆరోపణలు నిజమైతే గనుక.. అందులో ఆ పార్టీకి వెయ్యి ఓట్లు కూడా రాకూడదు. అలాకాకుండా వారికి కనీసం వెయ్యి ఓట్లు వచ్చినా కూడా.. పోలింగ్ చాలా పారదర్శకంగా జరిగినట్టుగా.. ఇన్నాళ్లూ అసలు ఎన్నికలే జరగనివ్వకుండా దుర్మార్గంగా నియోజకవర్గాన్ని గుప్పిటపట్టుకున్న జగన్ వైఖరిని ప్రజలు ఓటు ద్వారా ఈసడించుకున్నట్టుగా మనం గుర్తించాలి. ఒకే రౌండ్ లో పులివెందుల ఫలితాలు తేలిపోతాయని అంటున్న తరుణంలో.. మధ్యాహ్నంలోగానే.. జగన్మోహన్ రెడ్డి అండ్ కో చెబుతున్నది నిజాలా అబద్ధాలా అనేది తేలుతుందని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories