రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల సమావేశం ఎందుకు జరిగిందో గౌరవనీయ మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారికి అర్థం కావడం లేదుట. ఈ సమావేశం గురించి వారికి వివరణ ఇవ్వాలిట. అయినా ఇద్దరు సీఎంల భేటీ ఎందుకు జరిగిందో తనకు అర్థమవుతుందని అంబటి ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు. రెండేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి కూడా.. పోలవరం ప్రాజెక్టు నాకు అర్థం కాలేదని చెప్పిన మేథావికి.. ఈ భేటీ ఎలా అర్థమవుతుంది.. అని ప్రజలు అంబటిపై జోకులేసుకుంటున్నారు.
అంబటి తన జ్ఞానం ప్రదర్శించడాన్ని అక్కడితో ఆపడం లేదు. అంతకుమించి అతిశయమైన మాటలు మాట్లాడుతున్నారు. కృష్ణా జలాల నీటి పంపకాల అంశాన్ని తేల్చలేదని అంబటి అంటున్నారు. ఈ భేటీ కేవలం విభజన చట్టం ద్వారా తలెత్తిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటుచేసిన భేటీ అని ముందునుంచి ప్రకటిస్తూనే వస్తున్నారు.
ఆ సమస్యలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క భేటీతో తేలిపోయేవి కాదు. అయిదేళ్లపాటు పరిపాలన చేసి అసలు ఇలాంటి ప్రయత్నమే చేయని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుచరుడైన అంబటి రాంబాబు ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకోగలరని అనుకోవడం భ్రమ అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమస్యలేమీ తేలకుండానే.. హైదరాబాదు లోని ఉన్న ఆస్తులు, సెక్రటేరియేట్ లో వాటాలను తెలంగాణ రాసిచ్చేసిన అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచర దళాలకు.. అసలు చంద్రబాబునాయుడు- రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం గురించి మాట్లాడే హక్కే లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇద్దరు సీఎంల భేటీ.. చాలా చక్కగా మూడంచెల్లో సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేదు. అయితే.. అంబటి మాత్రం లేని వివాదాల్ని బూచిలా చూపించే ప్రయత్నంలో ఉన్నారు.
బహుశా వైసీపీ వాళ్లే కొన్ని మీడియా సంస్థలకు లీకులు ఇచ్చి, పెయిడ్ కథనాలు వేయించారేమో తెలియదు గానీ.. టీటీడీ ఆస్తుల్లో, బోర్డు పదవుల్లో, ఆదాయంలో తెలంగాణ వాటా కోరుతున్నదని, సముద్ర తీరంలో వాటా కోరుతున్నదని, పోర్టుల్లో వాటా కోరుతున్నదని రకరకాల గాలి కబుర్లను పోగేసి.. వాటికి చంద్రబాబు నాయుడు వివరణ చెప్పాలని అడగడం.. ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని ప్రజలు నవ్వుకుంటున్నారు.