ఆ ఇద్దరూ రెండో రోజు కూడా విచారణకు హాజరయ్యారు. కానీ.. పోలీసుల ప్రశ్నలు, వారి జవాబులు షరా మామూలే. తొలిరోజు ఎలాంటి డొంకతిరుగుడు జవాబులు చెప్పారో.. రెండో రోజు కూడా అదే రిపీట్ చేశారు. ‘తెలీదు.. సంబంధం లేదు’ తప్ప వారి నోటమ్మట మరో మాట రావడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ముందస్తు బెయిలు కావాలని కోరుకుంటున్న వారి పిటిషన్ సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. ముచ్చటగా మూడో రోజు కూడా విచారణకు రావాలని పిలిచిన సిట్ పోలీసులు.. సుప్రీం ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుంది అనేదానిని బట్టి.. ఆ ఇద్దరినీ అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుకు అనుంగు సేవకులు అయిన, ఆయన తరఫు వసూళ్లకు ఫైనల్ అథారిటీగా వ్యవహరించిన ముగ్గురిలో ఒకరు గోవిందప్ప బాలాజీ ప్రస్తుతం రిమాండులో ఉండగా.. మిగిలిన ఇద్దరు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయరెడ్డి ల పరిస్థితి ఇవాళ సాయంత్రంలోగా తేలనుంది. వారిద్దరూ కూడా అరెస్టు అయి కటకటాల వెనక్కు వెళతారా.. లేదా, సుప్రీం కోర్టు దయతో ఇంకొన్నాళ్లు బాహ్యప్రపంచంలో ఊపిరిపీల్చుకోగలుగుతారా? అనే టెన్షన్ వైసీపీ వర్గాల్లో ఉంది.
3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంలో రాజ్ కెసిరెడ్డి తన నెట్వర్క్ ద్వారా వసూలు చేసిన సొమ్ములు మొత్తాన్ని వీళ్ల చేతికి అందించేవారని ప్రాథమికంగా సిట్ పోలీసులు తేల్చారు. అయితే సుదీర్ఘకాలం పరారీలో ఉన్న వీరు, విచారణకు సహకరించాలన్న సుప్రీం ఆదేశాలతో బుధవారం సిట్ ఎదుటకు వచ్చారు. ఆ రోజు ఆరుగంటలు విచారించినా అధికారులు వీరినుంచి ఏమీ వివరాలు రాబట్టలేకపోయారు. గురువారం రెండో రోజు విచారణకు పిలిచి ఏకంగా 13 గంటల పాటు విచారించారు. వారి అక్రమాలకు సంబంధించి కొన్ని ఆధారాలను ఎదుట ఉంచి ప్రశ్నించినప్పుడు కొంత తడబాటుకు గురైనప్పటికీ… సర్వీసులో ఎంతోమంది పరిచయం అవుతుంటారు.. అవన్నీ గుర్తులేదు అంటూ బుకాయించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
కాగా సుప్రీం కోర్టు ఈ ఇద్దరికీ శుక్రవారం వరకు తదుపరి చర్యలకు ఉపక్రమించవద్దంటూ అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. వారి ముందస్తు బెయిలు పిటిషన్ శుక్రవారం విచారణకు వస్తుంది. వారిద్దరూ మూడోరోజు కూడా సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. సాయంత్రం దాకా విచారణ సాగే అవకాశం ఉంది. తర్వాత సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సుప్రీం కోర్టులో ప్రొసీడింగ్స్ ను బట్టి తేలుతుంది. సుప్రీం వారికి ముందస్తు బెయిలు ఇచ్చేస్తే వారు సేఫ్ జోన్ లోనే ఉన్నట్టు లెక్క. మళ్లీ మళ్లీ సిట్ వారిని విచారణకు పిలిచే అవకాశం ఉంది. అలాకాకుండా ముందస్తు బెయిలు పిటిషన్ ను నిరాకరించినా, అరెస్టు నుంచి రక్ష్ణణ కల్పించే వెసులుబాటు పోయినా.. శుక్రవారం సాయంత్రమే ఈ ఇద్దరినీ అరెస్టు చేసి, శనివారం కోర్టు ఎదుట ప్రవేశపెడతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.