తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బాగా వేడి మీద ఉన్నాయి. పదేళ్లపాటు పాలించిన భారత రాష్ట్ర సమితి నాయకులు ఇప్పుడు కేసుల ఊబిలో చిక్కుకుని సతమతం అవుతున్నారు. ఒకటి కాకుంటే మరొకటి.. అవినీతి కేసులు వారిని చుట్టుముడుతున్నాయి. అధికారంలో ఉన్నంత కాలమూ ముఖ్యమంత్రిని మించి చక్రం తిప్పిన కల్వకుంట్ల తారక రామారావు ప్రస్తుతం.. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో పీకల్దాకా కూరుకుపోయి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి జరుగుతున్న వరుస పరిణామాలను గమనిస్తూ వచ్చినప్పుడు.. ముందుగా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కేసులు గులాబీ నాయకులను ఇరుకున పెడతాయని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా ఫార్ములా ఈ కార్ రేసు గొడవ తెరపైకి వచ్చి.. ఇప్పుడు కేటీఆర్ అరెస్టు అనే అనుమానాల వరకు వెళ్లింది. ఈ విషయంలో ఈడీ మరియు ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న కేటీఆర్.. బయటకు వచ్చిన మీడియాతో మాట్లాడిన మాటల్లో ఒక్క విషయం మాత్రం చాలా తమాషాగా కనిపిస్తోంది.
ఈడీ విచారణకు కేటీఆర్ రెండోసారి హాజరయ్యారు. 45 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు ఎలాంటి నిబంధనలు పాటించకుండా హెచ్ఎండీయే నుంచి తరలించిన సంగతి గురించే అధికారులు ఎక్కువగా ప్రశ్నించారని విచారణ తర్వాత మీడియాకు చెప్పారు. తాను ఒక్కరూపాయి అవినీతికి కూడా పాల్పడలేదని రకరకాల ప్రమాణాలు కూడా చేశారు. సాధారణంగా కేసు నిరూపణ అయి శిక్ష పడిన తర్వాత కూడా నాయకులు ఇదే మాటలు చెబుతుంటారు గనుక.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
అయితే మరో సంగతిని మాత్రం గమనించాలి.
ఫార్ములా ఈ కార్ రేస్ మీద దర్యాప్తు కోసం ప్రభుత్వం దాదాపు 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టుగా తాను పత్రికల్లో చదివానని.. ఈ ఖర్చు మొత్తం దండగ అని కేటీఆర్ అంటున్నారు. ఇదంతా తన మీద కక్షతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మాత్రమేనని వ్యాఖ్యానిస్తున్నారు. తాను తప్పు చేయలేదు గనుక.. ప్రభుత్వం పెడుతున్న ఖర్చంతా వృథా అవుతుందని అంటున్నారు. దీని బదులుగా.. ఆ డబ్బును ఇతర అవసరాలకు వాడితే కనీసం కొందరు రైతులకు రైతుబంధు సాయమైనా అందించవచ్చునని కేటీఆర్, ఉచితసలహాలు కూడా ఇస్తున్నారు.
దీని అర్థం ఏమిటన్నమాట.. డబ్బు ఖర్చు అనవుతున్నది గనుక.. తన మీద దర్యాప్తును ఆపు చేయించి.. ప్రభుత్వం ఆ డబ్బును ఇతర అవసరాలకు వాడుకోవాలి.. అని చెబుతున్నట్టు! పోలీసులకు దొరికిన దొంగ.. ‘‘నన్ను కోర్టుకు, తర్వాత జైలుకు తీసుకువెళితే ప్రభుత్వానికి డీజిలు ఖర్చులు నష్టం.. నన్ను చక్కగా ఇంటికి పంపేస్తే మీకు డబ్బు సేవ్ అవుతుంది’’ అని సలహా ఇస్తున్నట్టుగా కేటీఆర్ మాటలు ఉంటున్నాయి. తాను పరిశుద్ధుడిని అని చాటుకునే క్రమంలో.. కేటీఆర్ కు అసలు తాను ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమవుతున్నట్టుగా లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.