వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. కంగారులో ఏ అంశాలు మాట్లాడితే.. తన పాత్రమీద ప్రజలకు అనుమానం పుడుతుందో.. ఏ అంశాలు మాట్లాడితే, తాను చేసిన ద్రోహాలు అన్నీ బయటకు వస్తాయో.. అలాంటి అంశాల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. తన మాటలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తే పోయేది తన పరువే అనే సంగతి ఆయన గ్రహించడం లేదు. ఇప్పుడు చంద్రబాబునాయుడును నిందించే ప్రయత్నంలో భాగంగా.. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా అంశాలను జగన్ తెరపైకి తెస్తున్నారు. ఈ అంశాలను ప్రస్తావించడం వల్ల.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి చేసిన ద్రోహాలన్నీ బయటకు వస్తాయనే సంగతి ఆయన మరచిపోతున్నారు.
చంద్రబాబునాయుడు తో బిజెపి కూడా పొత్తు పెట్టుకుని ఏపీలోని ఎన్నికల సమరాంగణంలో ఉండడాన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. పీసీసీ సారథిగా తన చెల్లెలు షర్మిల తన చేతగానితనాన్ని తీవ్రస్థాయిలో ఎండగడుతూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. అందరినీ ఒకే గాటన కట్టి విమర్శించడానికి జగన్ విభజన అంశాన్ని తవ్వుతున్నారు. ఇంతకూ ఆయన ఏం అంటున్నారంటే..
రాష్ట్రాన్ని చాలా అరాచకంగా ఒక జాతీయ పార్టీ విభజన చేసిందని, మరొక జాతీయ పార్టీ ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేసిందని.. ఆ పార్టీలన్నీ కూడా ఇవాళ చంద్రబాబునాయుడుతో జట్టుకట్టి తనను ఓడించడానికి ముందుకు వస్తున్నాయని జగన్ అంటున్నారు. విభజన అనేది గడచిపోయిన చరిత్ర. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రాష్ట్రానికి చేసిన ద్రోహం సంగతేమిటి? విభజన మాటెత్తితే ఆయన చేసిన ద్రోహాలన్నీ బయటకు వస్తాయని జగన్ కు తెలియదా అని ప్రజలు అంటున్నారు.
విభజన హామీలు, వాటాల పంపకం అన్ని విషయాల్లో లెక్క తేలేవరకు, హైదరాబాదు సెక్రటేరియేట్ లో ఉన్న పదేళ్లవాటాను వదులుకోకుండా.. కొన్ని ఆస్తుల పంపకాల మీద సంతకాలు పెట్టకుండా జాగ్రత్త పడాలని చంద్రబాబు విభజిత ఏపీకి తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక అనుకున్నారు. అయితే జగన్ సీఎం అయిన వెంటనే.. కేసీఆర్ మెహర్బానీ కోసం ఆయన ఇంటికి విందుకు వెళ్లి.. ఆయన డీల్ కు ఆశపడి.. హైదరాబాదులోని సెక్రటేరియేట్ సహా సమస్త ఆస్తుల మీద ఉన్న ఏపీ హక్కులను వదులుకుంటూ సంతకాలు పెట్టేశారు. ఆ ప్రభావం.. విభజన చట్టంలోని అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉండిపోయాయి. ఇప్పుడు వాటి గురించి తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదు. జగన్ సంతకాలు పెట్టకుండా ఉంటే రాష్ట్రానికి న్యాయం జరిగేది.
అలాగే ప్రత్యేకహోదా విషయంలో.. 2019 ఎన్నికలకు ముందు బీరాలు పలికి, కేంద్రం మెడలు వంచి తెస్తానని చెప్పి, గెలిచిన తర్వాత.. మోడీ ఎదుట సాగిలపడడం తప్ప.. ఏనాడూ ప్రత్యేకహోదా డిమాండును గట్టిగా వినిపించకుండా వంచించిన వ్యక్తి జగన్. అలాంటి జగన్ ఇప్పుడు ఆ రెండు అంశాలను ప్రస్తావించడం అనేది ఆయన సెల్ఫ్ గోల్ వేసుకునే చందంగానే ఉంది.