దొంగ చేతికి తాళాలు ఇస్తే వేరే గత్యంతరం లేక కాపలాకాస్తూ పడి ఉంటారని అనుకునేది పాతకాలం నాటి నీతి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. దొంగ చేతికి తాళాలు ఇస్తే గనుక.. సదరు తాళాలు, ఇనప్పెట్టె సహా మొత్తాన్ని దొంగలించుకుని తరలించుకుని తీసుకుపోతాడు. చేనును కాపాడాలని కంచె వేస్తే.. అది వేసిన నాటినుంచి ఆ కంచె చేనును మేతమేయడం ప్రారంభిస్తుంది ఈ రోజుల్లో. ప్రభుత్వం నడుపుతున్న వారిని చూస్తే ఇలాంటి సత్యాన్నే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అలాగే ప్రజలనుంచి రక్షణ అవసరమని భావించి.. ప్రజాప్రతినిధులకు గన్ మెన్ లను రక్షణకు అందిస్తే, అదే గన్ మెన్లతో ప్రజలనే కొట్టించే నాయకులు మనకు తయారవుతున్నారు. హతవిధీ ఇది మన ఖర్మ అనుకోవడం తప్ప ప్రజలు చేయగలిగింది ఏముంది. కానీ.. ఆ ఆదివాసీ యువకులు మాత్రం పోరాటం సాగిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు పేరు రాష్ట్రంలో అందరికీ చిరపరిచితమే. తన కారు డ్రైవరైన దళితుడిని హత్య చేసి వాళ్ల ఇంటికి డోర్ డెలివరీ చేసిన ధీరోదాత్త నాయకుడిగా ఆయనను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. కేవలం అంతే కాదు, హత్య కేసులో ప్రధాన నిందితుడిగా జైల్లో ఉండి, బెయిలుపై బయటకు వస్తే.. జాతినేత స్థాయిలో ఊరేగింపుగా గజమాలలతో సహా ఆయనను ఇంటికి తీసుకువెళ్లిన వైసీపీ పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని కూడా ప్రజలు చూశారు.
అలాంటి అనంతబాబు.. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కూటూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే.. గతంలో ఆదివాసీలకు ఇచ్చిన అనేక హామీలను అసలు ఏమాత్రం పట్టించుకోలేదని, ముందు వాటికి సమాధానం చెప్పిన తర్వాతే గ్రామంలోకి రావాలని ప్రజలు ఆయనను అడ్డుకున్నారు. చర్చిద్దాం రమ్మని నలుగురు యువకులను విడిగా పిలిచి వారిలో ఇద్దరి గన్ మెన్లతో చితక్కొట్టించి.. పోలీసులతో ఆ యువకుల గుంపును చెల్లాచెదరు చేసేసి అంనతబాబు ఆ ఊరిలోకి ప్రవేశించి ఎన్నికల ప్రచారం నిర్వహించడం విశేషం.
పోలవరం పరిహారం పొందిన భూములకు ఎకరాకు రూ.5లక్షల వంతున అదనంగా ఇస్తామన్న సొమ్ము గురించి, వ్యక్తిగత పరిహారం కింద ఒక్కొక్కరికి పదిలక్షల వంతున ఇస్తానన్న సొమ్ము గురించి ఆదివాసీ యువకులు ప్రశ్నించారు. హంతకులకు తమ ఊరిలోకి ప్రవేశం లేదన్నారు. యువకులు అడ్డుకోవడంతో ఎమ్మెల్సీ వద్ద ఉన్న గన్ మెన్ తుపాకీ మడమతో కొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. ఒకరికి తలపై తీవ్రగాయమై రెండుకుట్లు కూడా వేశారు. మరొకరిని వీపుపై నెత్తరుగాయాలయ్యేలా కొట్టారు.
పోలీసులు ఏమేరకు న్యాయం చేస్తారో గానీ.. ఈ దాడిపై ఆయువకులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హామీల గురించి అడిగితేనే ఇలా కొట్టించే వైసీపీ నాయకులు ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.