అనుచరుడు నోరు విప్పితే అప్పిరెడ్డికి కష్టాలే!

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద- జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలు, తమ  నాయకుల సారథ్యంలో చేసిన దాడి కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో దాదాపు 100 మందికి పైగా అరెస్టు అయ్యారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఈ కేసులో బెయిలు వచ్చినప్పటికీ మరోకేసు కారణంగా ఇంకా జైల్లోనే ఉన్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ వంటి వారు పోలీసు విచారణకు హాజరవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి పానుగంటి చైతన్య కోర్టులో లొంగిపోవడం ఒక కీలక పరిణామం.

చంద్రబాబు నాయుడు ఇల్లు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వైసిపి మూకలు చేసిన దాడులకు సంబంధించి కేసులను పోలీసు శాఖ- సిఐడి కి బదలాయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితులైన సీనియర్ నాయకులను పోలీసులు సోమవారం చివరిసారిగా విచారించారు. ఈ విచారణలో కూడా వారు పాత పాటనే పాడారు. తమకేమీ తెలియదని, సంబంధం లేదని, గుర్తు లేదని రకరకాల సమాధానాలు చెప్పారు. దాడిలో పాల్గొన్న వ్యక్తుల ఫోటోలను వీడియో ఫుటేజీలను చూపిస్తూ.. అదే వ్యక్తులతో ఈ నాయకులు కలిసి ఆత్మీయంగా దిగిన ఫోటోలు, ఆ వ్యక్తులు నిర్వహించిన కార్యక్రమాలకు వీరు హాజరైన ఫోటోలు అన్నింటినీ చూపి వాళ్లను గుర్తుపట్టండి అని అడిగినా కూడా వైసిపి నాయకులు సహకరించలేదు. 

రాజకీయ పార్టీ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా నిత్యం ఎంతోమంది వచ్చి తమతో ఫోటోలు దిగుతుంటారని, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారని అలాంటి అందరినీ గుర్తుంచుకోవలసిన అవసరం తమకు లేదని వాళ్ళు పోలీసులకు సెలవివ్వడం విశేషం. ఫోన్లు అప్పగించాలని కోరినా కూడా కోర్టు చెబితే తప్ప ఇవ్వం అంటూ మొండికేయడం గమనార్హం.

నాయకులు ఒకవైపు పోలీస్ విచారణకు హాజరైన రోజునే లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు పానుగంటి చైతన్య కోర్టులో లొంగిపోయాడు. దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న, ప్రధాన నిందితులలో ఒకడైన చైతన్య పోలీసులు ఎదుట హాజరైనప్పుడు ఏం చెబుతారు? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. తమను దాడికి ప్రేరేపించిన నాయకుల పాత్రను ఆయన స్పష్టంగా చెబుతారా? లేదా తమ సీనియర్ నాయకుల లాగా డొంక తిరుగుడు సమాధానాలతో కేసులు మరింత సాగదీయాలని చూస్తారా అనేది గమనించాలి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని, ఆ పార్టీని విడిపోవడమే మంచిదని గుర్తించిన అనేకమంది నాయకులు రాజీనామాలు చేస్తున్న తరుణంలో వారిని నమ్ముకుని పూర్తిగా కేసులో కూరుకుపోవడం కంటే నిజం చెప్పి జాగ్రత్త పడటం మంచిదని చైతన్య అనుకుంటే గనుక విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ నాయకులకు ఇబ్బందులు తప్పవు. అసలేం జరిగిందో నిజాలన్నీ చైతన్య బయటపెడితే వారికి కష్టాలే. ఎవరు ఎవరిని ప్రేరేపించారు? ప్రేరేపించిన వారికి అలాంటి ఆదేశాలు ఏ పెద్ద తలల నుంచి వచ్చాయో అంతా బయటకు వస్తుంది! అందరూ కలిసి ఉమ్మడిగా కటకటాలు లెక్కించాల్సి వస్తుంది అని ప్రజలు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories