ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అపరిమితమైన భూదాహంతోనే విశాఖపట్టణంను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించి అక్కడ దందాలు సాగించారని అనడానికి ఇది మరొక మంచి ఉదాహరణ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహా రెడ్డి.. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సి ఆర్ జెడ్) నిబంధనలను అతిక్రమించి.. భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసే విషయంలో చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీంతో అధికారులు విజయసాయిరెడ్డి కుమార్తెకు చెందిన నిర్మాణాలను కూలగొట్టే పనిలో ఉన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే ఋషికొండ విధ్వంసం సాగించి భవనాలు నిర్మించినందుకు వైయస్ జగన్ ఆయన అనుచర వర్గాల మీద ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని హైకోర్టు ఆదేశించి రెండు రోజులు కూడా గడవకమునుపే.. తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలను కూల్చేయాలని తీర్పు కూడా రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అతిపెద్ద దెబ్బ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఋషికొండను నాశనం చేసి తన ప్యాలెస్ కట్టుకుంటే.. ఆయన అనుంగు సహచరుడు విజయసాయిరెడ్డి కుమార్తె పేరిట తీర ప్రాంతంలో  అదే విధ్వంసాన్ని కొనసాగించిన అరాచకం ఇది! ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత చందంగా చెలరేగిన వైనం ఇది.

విశాఖపట్నంకి చెందిన జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని అనుసరించి ఈ తీర్పు వెలువడింది. భీమిలి బీచ్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన పిల్ వేశారు. నిజానికి నిర్మాణాల కూల్చివేతకు జీవీఎంసీ అధికారులు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. వాటిని సవాలు చేస్తూ నేహా రెడ్డి సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ వేశారని, ఆ వ్యాఖ్యల్లో మధ్యంతర ఉత్తర్వులు రాలేదని కోర్టులో నివేదించారు. స్టే ఉత్తర్వులు రాలేదు గనుక అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని ద్విసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. 

విశాఖపట్నం ని రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి కొండలు, సముద్రతీరం అనే తేడా ఏమీ లేకుండా కనిపించని భూమినెల్లా కబ్జా చేసేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా బరితెగించి ప్రవర్తించారు అని తెలుసుకోవడానికి విజయసాయిరెడ్డి కూతురు చేసిన నిర్వాకం ఒక పెద్ద ఉదాహరణ. వారి అరాచకమైన భూదాహానికి చెంపపెట్టు లాగా.. ఇప్పుడు కోర్టు తీర్పు వెలువడింది. అధికారులు ఎంత త్వరగా ఆ నిర్మాణాలను కూల్చివేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories