ప్రజల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. రాజకీయ నాయకులు సాధారణంగా ‘యేరు దాటేదాకా ఓడమల్లన్న.. యేరు దాటిన తర్వాత బోడి మల్లన్న’ సామెత చెప్పే కుటిల నీతినే అనుసరిస్తూ ఉంటారు. ఎన్నికలు ముగిసేదాకా ప్రజలను దేవుళ్లుగా కీర్తించేవాళ్లు.. గెలిచిన తర్వాత.. వారిని అసలు పట్టించుకోరు. కానీ.. ప్రజలకు తమ నిరసనను, వ్యతిరేకతను తెలియజేసే హక్కు, మార్గం ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఆ చైతన్యం కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుంచి ఇప్పటిదాకా శాసనసభకు హాజరుకాకపోవడం గురించి.. ఆయనను గెలిపించిన నియోజకవర్గం గజ్వేల్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. వెయ్యిమందికి పైగా గజ్వేల్ ప్రజలు మూకుమ్మడిగా హైదరాబాదుకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ ను, గవర్నరు జిష్ణుదేవ్ వర్మను కలిసి.. తమ ఎమ్మెల్యే అసలు సభకే వెళ్లడం లేదని, ఆయనను అనర్హుడిగా ప్రకటించి తమ నియోజకవర్గానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
తెలంగాణలో కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే దాపురించిన దుస్థితి ఇది. ఒక ఎమ్మెల్యే కేసీఆర్ మాత్రమే సభకు వెళ్లకుండా అహంకార రాజకీయాలు నడిపిస్తున్నారు. కానీ ఏపీ పరిస్థితి ఇంకా ఘోరం! ఇక్కడ ఒక్కడి అహంకారానికి 10మంది బలవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి.. తనకు ప్రతిపక్షనేత హోదా కావాలనే అనుచిత డిమాండుతో ఊరేగుతున్నందుకు.. పాపం.. మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు కూడా శాసనసభకు వెళ్లకుండా మిన్నకుండిపోతున్నారు. జగన్ మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి.. తన అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు గానీ.. మిగిలిన పదిమంది ఎమ్మెల్యేల పేర్లను కూడా ప్రజలు మరచిపోయే పరిస్థితి.
గజ్వేల్ ప్రజల చైతన్యం చూసి ఇప్పుడు ఏపీలో వైసీపీ గెలిచిన 11 నియోజకవర్గాల ప్రజలు కూడా మేలుకుంటున్నారు. గెలిచిన నాటినుంచి ఇప్పటిదాకా ప్రమాణ స్వీకారాలు చేయడానికి మినహా.. అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న తమ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో ఆగ్రహం వస్తోంది. గెలిపించిన తమకోసం కాకుండా.. జగన్ కళ్లలో ఆనందం చూడడానికి మాత్రమే వారు బతుకుతున్నారనే అభిప్రాయం ఏర్పడుతోంది. 11 నియోజకవర్గాల ప్రజలు ఒకేసారి మూకుమ్మడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకరు అయ్యన్నపాత్రుడు, గవర్నరు నజీర్ అహ్మద్ లను కలిసి.. వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరాలని ప్రజల్లో చైతన్యం వస్తోంది.
కేసీఆర్ నిజానికి ఇప్పుడు తెలంగాణలో ఇరకాటంలో ఉన్నారు. ఏపీలో జగన్ పరిస్థితి ఓకే. నాకు హోదా ఇస్తే తప్ప నేను సభకు వెళ్లను అని ఆయన ప్రకటించారు. కానీ.. మిగిలిన పదిమంది ఎందుకు వెళ్లరు? జగన్ హోదా కోసం పోరాడడానికి కాదు కదా మిమ్మల్ని గెలిపించింది అని ఆయా నియోజకవర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి వారి ప్రశ్నలకు ఈ ఎమ్మెల్యేల వద్ద జవాబు ఉందో లేదో గానీ.. నియోజకవర్గాల్లో ప్రజల ప్రతిఘటన మాత్రం ఎదుర్కోక తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.