ఆ మాట జనం నమ్మితే. జగన్ కు గండమే!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘‘అ ఆ’’ చిత్రంలో క్లైమాక్సులో ఒక డైలాగు ఉంటుంది. హీరో నితిన్‌ను అన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన విలన్ రావు రమేష్, అన్ని ప్రయత్నాలలోనూ విఫలమైన తర్వాత చిట్టచివరగా కొడుకుతో ఒక మాట అంటాడు ‘‘శత్రువులు సెపరేటు ఎక్కడ ఉండర్రా..  మన ఇళ్లలోనే కూతుళ్లలాగానో.. చెల్లెళ్లులాగానో పుడతారు’’ అని! ఈ మాటను బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోజుకు వందసార్లు మననం చేసుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమరంలో ఆయన ఎదుర్కొంటున్న మొట్టమొదటి ప్రత్యర్థి ఆయన చెల్లెలు వైఎస్ షర్మిలనే! ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, దుర్మార్గుడు, రాష్ట్రాన్ని దోచుకు తినేస్తున్నాడు లాంటి రకరకాల రొటీన్ ఆరోపణలతో చంద్రబాబు నాయుడు ఆయనకు చేయగలిగే డ్యామేజీ కంటే, షర్మిల చేసే నష్టం ఎక్కువ! దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి తెలుగు ప్రజలలో ఉండే అభిమానం అనే పునాదుల మీదనే జగన్మోహన్ రెడ్డి రాజకీయ బతుకు ప్రస్థానం నడుస్తోంది. అలాంటిది రాజశేఖర్ రెడ్డి అభిమానుల్లో జగన్ అంటే అసహ్యం పుట్టే లాగా వైఎస్ షర్మిల కొత్త కొత్త ఆరోపణలను రోజుకొకటిగా బయటకు తీస్తున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి రాముడైతే లక్ష్మణుడిలా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేయించిన హంతకుడు అవినాష్ రెడ్డిని రెండోసారి పార్లమెంటుకు పంపడానికి జగన్ తపన పడిపోతున్నాడు అంటూ షర్మిల ఇప్పటికే చెలరేగిపోతున్న సంగతి అందరికీ తెలుసు. తాజాగా ఆమె అక్రమాస్తులకు సంబంధించిన సిబిఐ ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్ పేరును జగన్ బలవంతంగా ఇరికించారంటూ సరికొత్త ఆరోపణలను తెరమీదికి తెచ్చారు. న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా మూడు కోర్టులలో పిటిషన్లు వేయించి తొలుత ఎఫ్ఐఆర్లో లేని వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును చార్జిషీట్లోకి వచ్చేలాగా చేసింది అన్నయ్య జగన్మోహన్ రెడ్డి అని ఆమె చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా,  రాజశేఖర్ రెడ్డి పేరు కూడా చార్జిషీట్లో ఉన్నట్లయితే తాను తప్పించుకోవడం సులభం అవుతుంది అని జగన్ ఆ రోజు నమ్మాడు అనేది ఆమె వాదన.

ఈ మాటలను ప్రజలు నమ్మారంటే గనుక జగన్ బతుకు భ్రష్టు పట్టిపోతుందనటంలో సందేహం లేదు. ఇవాల్టికైనా సరే జగన్‌కున్న ప్రధానమైన బలం రాజశేఖర్ రెడ్డి అభిమానులే. అలాంటిది వారందరూ కూడా తమ ప్రియతమ నేతకు ద్రోహం చేసింది కన్నకొడుకే అనే సంగతిని గుర్తించారంటే షర్మిల మాటలను విశ్వసించారంటే జగన్‌ను అసహ్యించుకుంటారు, ఆయన పతనాన్ని కోరుకుంటారు! అందుకు తమ శక్తి యుక్తులు అన్నీ వెచ్చిస్తారు. అదే జరిగితే గనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోతుంది అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories