ఒకవైపు ఆరునెలల్లోగా రాష్ట్రంలోని అన్ని రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేయడానికి చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. అంతకు ముందునుంచే నామినేటెడ్ పదవుల ఆశావహుల ప్రయత్నాలు మిన్నంటూతూనే ఉన్నాయి. ఆయా పదవుల స్థాయినిబట్టి.. ఎమ్మెల్యేలను ఆశ్రయించేవారు, అంతకంటె పెద్దస్థాయి వారిని ఆశ్రయించేవారు రకరకాలుగా ఉంటున్నారు. కాకపోతే.. తాజాగా ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పిన ఒక సంగతిని గమనిస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. పదవులకోసం నాయకుల మీద ఎంతగా ఒత్తిడి ఉంటుందో కదా అనిపిస్తుంది.
పవన్ కల్యాణ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవుల్లో వివిధ ఛైర్మన్ పదవులకోసం తన మీద పార్టీ నాయకులనుంచి విపరీతంగా ఒత్తిడి ఉన్నదని అంటున్నారు. ఒక్క టీటీడీ చైర్మన్ పదవి కోసమే పవన్ కల్యాణ్ ను ఇప్పటికే యాభై మంది అడిగారట. కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలం కదా.. అని పవన్ చెప్పుకొచ్చారు.
నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. టీటీడీ ఛైర్మన్ గా పవన్ అన్నయ్య నాగబాబును నియమించబోతున్నట్టుగా పుకార్లు వినిపించాయి. ఆ తర్వాత ఆయన స్వయంగా వాటిని ఖండించారు. ఇప్పుడు పవన్ కూడా ఆ పుకార్లను ఖండించారు. నాకుటుంబ సభ్యులెవరూ ఈ పదవిని అడగలేదు. కానీ.. ఇందరు నామీద ఒత్తిడి తెస్తుండగా.. మీకు సాయం చేశాం గనుక.. మాకు ఈ పదవులు ఇవ్వాలని చంద్రబాబును ఎలా అడగాలో తెలియడం లేదు.. అంటూ పవన్ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు తెలుగుదేశం వారిలో కొత్త చర్చ నడుస్తోంది. 21 సీట్లున్న జనసేన అధినేత మీదనే టీటీడీ ఛైర్మన్ కోసం 50 మందినుంచి ఒత్తిడి ఉంటే.. 135 సీట్లు, రాష్ట్రవ్యాప్త కేడర్ ఉన్న తెలుగుదేశం అధినేత మీద అదే పదవికోసం ఒత్తిడి చేస్తున్న వారి సంఖ్య వందలు, వేలల్లో ఉంటుంది కదా.. అని కూడా పలువురు అంటున్నారు.
టీటీడీ చైర్మన్ పదవిని కేవలం ఒక నామినేటెడ్ పదవిలాగా చూడకూడదు. అదొక ధార్మిక కార్యక్రమంగా చూడాలి. ఆధ్యాత్మిక చింతన, దైవభీతి ఉండే పెద్దవారిని మాత్రమే ఆ పదవికి కన్సిడర్ చేయాలి. వారిలో సేవాతత్పతర, ధర్మపరాయణత ప్రధాన లక్షణాలుగా ఉండాలి. అంతే తప్ప.. నామినేటెడ్ పోస్టులు డిమాండ్ చేస్తున్న వారిలో గట్టివారెవ్వరో వారికి టీటీడీ ఇచ్చేయడం కరెక్టు కాదు అని ప్రజలు అంటున్నారు.