ఇవాళంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో దిక్కూమొక్కూ లేదు. చెప్పుకోదగ్గ, యాక్టివ్ గా ఉన్న నాయకులకు గతిలేదు. పార్టీ తరఫున ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే.. బోలెడు మందిని బతిమాలుకుని చివరికి ఎవరో ఒకరితో పెట్టించాల్సి వస్తోంది. బీసీ నాయకుల సంగతి సరేసరి. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన తరువాత.. ఆపార్టీకి నాయకులకు గతిలేకుండాపోయింది. మరి ఏడాదిన్నర కిందట పరిస్థితి అది కాదు కదా. బీసీ నాయకులు కూడా ఆ పార్టీలో పుష్కలంగానే ఉన్నారు కదా. అయినా సరే.. జగన్ తమకు గతిలేదన్నట్టుగా.. తెలంగాణ నుంచి ఆర్.కృష్ణయ్యను వలసతీసుకువచ్చి ఆయనకు వైసీపీ తరఫున ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టారు. తీరా ఇంకా నాలుగేళ్ల పదవి మిగిలి ఉండగానే.. ఆర్ క్రిష్ణయ్య తూచ్ అనేసి.. ఛీ కొట్టి పార్టీకి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేశారు.
ఇలాంటి పరిణామం జగన్మోహన్ రెడ్డికి పార్టీలో అంతర్గతంగా అత్యంత అవమానకరమైన విషయం. పార్టీని నమ్ముకుని కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఎవరో ఒక బీసీ నాయకుడికి ఆ రాజ్యసభ పదవి ఇచ్చి ఉంటే.. కనీసం ఇవాళ్టికి ఎంపీల కౌంట్ అయినా మిగిలిఉండేది. కానీ జగన్ ఆ పనిచేయలేదు. వలస నాయకుడిని నెత్తిన పెట్టుకున్నారు. ఇవాళ పార్టీలోని బీసీ ప్రముఖులందరూ జగన్ కు తగిన శాస్తే జరిగిందని లోలోపల పండగ చేసుకుంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుకాన్ బంద్ కావడానికి దగ్గరలోనే ఉన్నదనే పుకార్లు తాడేపల్లి వర్గాల్లో చురుగ్గా వినిపిస్తున్నాయి. ఒక్కచాన్స్ ను వాడుకుని, ఏక బిగిన మరో ముప్పయ్యేళ్లు పరిపాలించేద్దామని కలలుగన్న జగన్.. ఇప్పుడు దక్కినది చాల్లే అనుకుని.. ఇక విశ్రాంత జీవనం గడపాలని అనుకుంటున్నారో ఏమో తెలియదు. పార్టీ గురించి పట్టించుకోవడం లేదు. ఆర్.క్రిష్ణయ్య కూడా వెళ్లిపోయారు. ఇప్పుడు ఎంపీస్థానానికి ఉప ఎన్నికవచ్చినా జగన్ పార్టీ గెలవదు.
ఈ కారణం చూపించి మరింత మంది బీసీ నాయకులు కూడా వెళ్లడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. జగన్మోహన రెడ్డి ఈ విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.