జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో కల్లబొల్లి కబుర్లు చెప్పారు. మాయ మాటలు చెప్పారు. మూడు రాజధానులు అన్నారు. అధికార వికేంద్రీకరణ అన్నారు. నానా మాటలు చెప్పారు. కానీ.. మూడు రాజధానులు అంటూ చెప్పిన ఏ ఒక్క నగరానికి కూడా ఆయన చేసిన గట్టి పని ఒక్కటి కూడా లేదు. విశాఖపట్నంలో తన నివాసం కోసం రుషికొండను గొరిగించేసి ప్యాలెస్ లు కట్టుకోవడం మినహా.. జగన్ ఏమీ ఒరగబెట్టలేదు. అయితే జగన్ హామీలకు అసలైన కార్యరూపం అంటే ఏమిటో.. ఆచరణాత్మక దృక్పథంతో పనులు చేపట్టడం అంటే ఏమిటో ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిరూపిస్తోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి బాబు సర్కారు కసరత్తు ప్రారంభించింది.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి చంద్రబాబునాయుడు తొలినుంచి సుముఖంగానే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా 2014 ఎన్నికలకు పూర్వం నుంచి కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామనే వాదనను వినిపిస్తూనే ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తానేదో కొత్తగా చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి.. కర్నూలులో చీఫ్ జస్టిస్ తో కూడిన హైకోర్టు ఏర్పాటు చేస్తానని అన్నారు. అంటే ప్రధాన హైకోర్టు కర్నూలులోనూ, బెంచ్ అమరావతిలోనూ ఉండేలాగా ప్రకటించారు. తద్వారా కర్నూలు న్యాయరాజధాని అనే మాయమాటలను ఆయన ప్రయోగించారు. అయితే తన అయిదేళ్లు పాలన కాలంలో అలాంటి ప్రయత్నానికి సంబంధించిన కసరత్తు కూడా ఆయన ప్రారంభించలేదు. చీఫ్ జస్టిస్ తో కూడిన హైకోర్టును మార్చడానికి ముందుగా వారి అనుమతి తీసుకోవాలని, అది తన ఇష్టారాజ్యంగా చేయడం కుదరదని జగన్ అనుకోలేదు.
ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించింది. దీనిపై అభిప్రాయం కోరుతూ హైకోర్టుకు న్యాయశాఖ కార్యదర్శి లేఖ రాయడం ద్వారా తొలి అడుగు పడింది. కేంద్రప్రభుత్వాన్ని కూడా సంప్రదించిన తర్వాత.. ఈ విషయంలో హైకోర్టు అభిప్రాయం తెలియజేసే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం దీనికి సానుకూలమే గనుక.. ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చునని, కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవుతుందని అందరూ భావిస్తున్నారు.
పలురాష్ట్రాల్లో ఇప్పటికే హైకోర్టు బెంచ్ లు ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇలా అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటి సరసన ఏపీ కూడా చేరనుంది.