‘మాట తప్పను- మడమ తిప్పను’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తన గురించి తాను పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన జనం ముందు అవసరార్థం చెప్పే ఎన్నెన్ని మాటల విషయంలో మాట తప్పారో లెక్కతీస్తే కొండవీటి చాంతాడంతవుతుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి ఒక కేటగిరీ కిచెందిన హామీ.. ప్రజలకు ఇచ్చాడంటే గనుక.. ఖచ్చితంగా దానిని నెరవేర్చేది ఉండదని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలను బుట్టలో పెట్టడానికి ఆయన మాట చెబుతారే తప్ప దానిని నెరవేర్చే చిత్తశుద్ధి ఆయనకు ఏమాత్రం ఉండదని నవ్వుకుంటున్నారు. ఇంతకూ అది ఏ కేటగిరీ హామీనో తెలుసా.. ‘‘మీరు ఈ నాయకుడిని గెలిపించండి.. గెలవగానే పలానా పదవి ఇస్తా’’ అని ప్రకటించడం!
చాలా మందికి గుర్తుండకపోవచ్చు గానీ.. 2014 ఎన్నికల నాటికే తెలంగాణతో తనకు సంబంధంలేదని దాదాపుగా వదిలించుకున్న జగన్మోహన్ రెడ్డి ఖమ్మం పరిధిలో మాత్రం పొంగులేటి కోసం గట్టిగానే ప్రచారం నిర్వహించారు. పొంగులేటిని ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రమంత్రిని చేస్తానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి మాత్రమే నేత అయిన, జాతీయ స్థాయిలో ఏ కూటమిలోనూ లేని జగన్ ఆ హామీ ఎలా ఇచ్చారో తెలియదు. ప్రజలు పొంగులేటిని గెలిపించారు గానీ.. జగన్ మాట నిలబెట్టుకోలేదు సరి కదా.. కనీసం గెలిపించిన పొంగులేటిని కూడా నిలబెట్టుకోలేదు. తన ఆత్మీయుడైన కేసీఆర్ పార్టీ లోకి పంపేసి చేతులు దులుపుకున్నారు.
2019 ఎన్నికలకు ముందు ఇలాంటి ‘మంత్రి పదవి’ హామీలు చాలా ఇచ్చారు. మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడిస్తే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డికి మంత్రి పదవి ఇస్తానన్నారు. అలాంటి మంత్రి పదవి హామీని అనేక నియోజకవర్గాల్లో ఇచ్చారు. మర్రి రాజశేఖర్ ను కూడా మంత్రి పదవితో ఊరించారు. ఇవేవీ ఒక గదిలో వారికి ఇచ్చిన హామీలు కాదు. బహిరంగ సభల వేదికల మీద నుంచి ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదంతా మరచిపోయారు. మంత్రి పదవుల లెక్కలు వేరే. ప్రజలకు మాట ఇచ్చి గెలిపించుకున్న నేతల్ని పక్కన పెట్టారు.
ఇప్పుడు కూడా జగన్ అదే మాయ టెక్నిక్ ను ప్రయోగిస్తున్నారు. పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికే చెందిన వంగా గీత ద్వారా పవన్ కల్యాణ్ ను ఓడించేయగలనని అనుకుంటున్న జగన్.. చివరిరోజు అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. వంగా గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించడం గమనార్హం. వంగా గీత ఖచ్చితంగా గెలవదు అనే నమ్మకంతోనే జగన్.. ఇలాంటి ఆర్భాటపు హామీ ఇస్తున్నారని పిఠాపురం ప్రజలు నవ్వుకుంటున్నారు.