జగన్ కడుపుకొడితే.. చంద్రబాబు ఆకలి తీరుస్తున్నారు!

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించిన తక్షణం విధ్వంసంతో  పరిపాలన ప్రారంభించారు. అమరావతిని సర్వనాశనం చేసే దిశగా అడుగులు వేశారు. చంద్రబాబు నాయుడు ముద్ర ఉంటుందని, ఆయనకు కీర్తి దక్కుతుందని అక్కసుతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అందరూ అనుకున్నారు. అవన్నీ కూడా చంద్రబాబు మీద ఆయన కక్షపూరిత నిర్ణయాలుగా అర్థం చేసుకోవచ్చు. కానీ పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ వ్యవస్థను రద్దు చేయడం మాత్రం దుర్మార్గమైన నిర్ణయంగా పేరు పడింది. తటస్థులు ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేని నిర్ణయం అయింది.

2014 తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమం ప్రారంభించారు. నిరుపేదలకు, కూలీలకు, రిక్షా ఆటోవాలాలకు ఎంతోమందికి ప్రతి ఊరిలోనూ ఈ అన్న క్యాంటీన్లు ఎంతో సదుపాయంగా ఉండేవి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది అన్నార్తుల ఆకలిని ఈ అన్న క్యాంటీన్లు తీర్చాయి.

అలాంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ క్యాంటీన్లను రద్దు చేయడం బహుధా విమర్శల పాలయ్యింది. జగన్ సొంత పార్టీలో కూడా అనేకమంది నాయకులు అన్న క్యాంటీన్ రద్దు చేయడానికి వ్యతిరేకించారు. చాలామంది మేధావులు కూడా అన్న క్యాంటీలను రద్దు చేయకుండా, కావలిస్తే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ఆర్ పేరుతో వాటిని నడపవచ్చునని సలహా ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి అవేవీ తలకెక్కలేదు తాను తలచిందే కరెక్ట్ అన్నట్లుగా పేదవాడి కడుపు కొట్టారు.

అన్న క్యాంటీన్లు మూసివేసిన తర్వాత విపరీతంగా విమర్శలు రావడంతో.. బొత్స సత్యనారాయణ వంటి నాయకులు అన్న క్యాంటీన్లను మరో రూపంలో ప్రారంభిస్తామని ఆసుపత్రుల వద్ద రోగులకు వారి బంధువులకు సేవలు అందించేలా చూస్తామని రకరకాల మాయమాటలు చెప్పారు. అవేమీ కార్యరూపంలోకి రాలేదు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి రానేలేదు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేసిన తొలి సంతకాలలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఉంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 203 చోట్ల అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. రాష్ట్రమంతా ఒకే రీతిలో, ఒకే మెనూతో వీటిని నిర్వహించబోతున్నట్లుగా మంత్రి నారాయణ ప్రకటించారు.

జగన్ కడుపు కొడితే, పేదవాడి ఆకలి తీర్చే నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తిరిగి అమలులోకి తీసుకు వచ్చినందుకు నిరుపేదలు రాష్ట్రమంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories