విశాఖపట్నం ప్రాంతంలో సినిమారంగం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందనే నమ్మకంతో.. ప్రభుత్వం వారికి భూములు కేటాయించింది. అందుకు సంబంధించిన పనులు చేయడంలో ఒకవైపు జాప్యంచేస్తూ.. మరొకవైపు స్టుడియోల కోసం పొందిన స్థలాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా చేసుకుని లాభ పడాలని ఆ సంస్థ తలపోసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో ఎలాంటి అడ్డదారులు అయినా సాధ్యమే అనే నమ్మకంతో.. రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకోవడానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ అనుమతుల కోసం పాలకులతో బేరం తెగనేలేదు. ఈలోగా.. కోర్టులో కేసులు పడ్డాయి. అవి నడుస్తుండగానే.. ఇలాంటి కన్వర్షన్లు చేయదలచుకున్నందున అసలు ఆ భూమిని ప్రభుత్వం ఎందుకు వెనక్కు తీసుకోకూడదో..
తెలియజేయాలంటూ.. ప్రభుత్వం వారికి షోకాజ్ నోటీసులు జారీచేయబోతోంది. ఇదంతా విశాఖలో స్టుడియోల కోసం స్థలం పొందిన రామానాయుడు స్టుడియోస్ కు సంబంధించిన వివాదం. గతంలో జగన్ వారితో బేరం పెడితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరాచకాల భరతం పడుతోందని అంతా అనుకుంటున్నారు.
విశాఖపట్నంలో స్టుడియోల నిర్మాణం, ఇతర సినీ పరిశ్రమ సంబంధిత అవసరాలకోసం గతంలో ప్రభుత్వం రామానాయుడు స్టుడియోస్ కు 34.44 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిలో దాదాపు 15.17 ఎకరాలను ఇళ్ల లేఅవుట్ కోసం అనువుగా మార్చి విక్రయించుకోవాలని రామానాయుడు స్టుడియో సంస్థ భావించింది. అందుకు అనువుగా అనుమతులు ఇవ్వాలంటూ.. వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ నిర్ణయం వెనుక అనేక పెద్ద తలకాయలు ఉన్నాయని, ప్రభుత్వ పెద్దలే కొందరు రహస్య భాగస్వాములుగా ఉంటూ రామానాయుడు సంస్థను బెదిరించి, వెంచర్ గా మార్చడానికి దరఖాస్తు చేయించారని కూడా అప్పట్లో పుకార్లు వినిపించాయి. ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగానే కనిపించింది.
రామానాయుడు స్టుడియోస్ వారి అభ్యర్థను వ్యతిరేకిస్తూ.. భూమార్పిడికి అనుమతించకూడదని కోరుతూ.. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూమార్పిడిని అనుమతించవద్దంటూ జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్.. కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఈ భూముల రద్దుకు సంబంధించి.. రామానాయుడు స్టుడియోస్ కు షోకాజు నోటీసులు జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టరును రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోదియా ఉత్తర్వులు జారీచేశారు. వారికి తగినంత సమయం ఇచ్చిన తర్వాత, తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టరుకు పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు.