గాజు గ్లాసు గుర్తు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నదా? వారి భిన్నమైన వ్యవహార సరళి కారణంగా.. కూటమి పార్టీలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో పోటీచేస్తున్న ఒక పార్టీకి కామన్ సింబల్ గా ఒక గుర్తును కేటాయించినప్పుడు.. ఆ రాష్ట్రంలో మరెవ్వరికీ అదే గుర్తు దక్కకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. కానీ వారా పని చేయలేదు. జనసేన పోటీచేస్తున్న 21+2 నియోజకవర్గాల్లో తప్ప గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గానే నోటిఫై చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం.
ఆయా నియోజవకర్గాల్లో ఇండిపెండెంట్లు జనసేన, తెలుగుదేశం రెబెల్స్ ఆ గుర్తును తీసుకుంటున్నారు. దీంతో కూటమిగా పోటీచేస్తున్నప్పటికీ ఈసీ నిర్ణయం కారణంగా.. తెలుగుదేశం, బిజెపి అభ్యర్థులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. అదే సమయంలో.. గాజు గ్లాసు గుర్తుగా పొందుతున్న ఇండిపెండెంట్లకు భారీగా ఫైనాన్స్ చేసి, వారు విస్తృతంగా ఓట్లు వేయించుకునేలా ఆ మేరకు తమ ప్రధాన ప్రత్యర్థిని దెబ్బకొట్టేలా.. వైఎస్సార్ కాంగ్రెస్ కుట్ర వ్యూహాలను కూడా ప్రారంభించింది. ఈ లోగా జరుగుతున్న తీవ్రనష్టం గురించి- జనసేన హైకోర్టును ఆశ్రయించింది.
అయితే హైకోర్టుకు ఈసీ ఇచ్చిన నివేదిక చిత్రంగా ఉంది. జనసేన ఎంపీ స్థానాల్లో కూడా పోటీచేస్తున్న కాకినాడ, మచిలీపట్నం నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యే స్థానాల్లో మాత్రం ఎమ్మెల్యే ఇండిపెండెంట్లు ఎవ్వరికీ ఆ గాజు గ్లాసు గుర్తు ఇవ్వబోమని చెప్పింది. అంటే అక్కడ మాత్రం కూటమి అభ్యర్థులు నష్టం తప్పించుకుంటారు.
మిగిలిన సీట్లలో అంటే ఇంచుమించు 140 స్థానాల్లో తెలుగుదేశం, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల మెడపై కత్తిలాగా గాజుగ్లాసు గుర్తు వేలాడుతూ ఉంటుంది. అక్కడ ఎవరైనా ఆ గుర్తు తీసుకుంటే వారు భారీగా నష్టపోతారు.
అయితే రెండు ఎంపీసీట్ల పరిధిలో ఏ ఏర్పాటు చేయగలుగుతున్నదో, అదే ఏర్పాటును ఈసీ రాష్ట్రమంతా కూడా చేసి తీరాలని కూటమి పార్టీలు అభ్యర్థిస్తున్నాయి. ఇలాంటి మెలిక వలన.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.