మూడున్నర వేల కోట్లరూపాయల లిక్కర్ కుంభకోణం అనేది సామాన్యమైనది కాదు. కనీసం ఎక్సయిజు మంత్రికి సమాచారం కూడా కొత్త మద్యం పాలసీకి రూపకల్పన చేయడం దగ్గరినుంచి, డిస్టిలరీలను బెదిరించి నెలవారీ కోట్లాదిరూపాయల ముడుపులు వసూలు చేయడం వరకు అప్పటి ఎక్సయిజు మంత్రికి తెలియకుండానే జరిగి ఉంటుందా? అనేది సాధారణంగా అందరికీ కలిగే సందేహం. కానీ.. వందల కోట్ల రూపాయల ఆమ్యామ్యాలు చేతులు మారిన విద్యుత్తు ఒప్పందాలు కూడా అప్పటి విద్యుత్తు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియకుండానే జరిగిన వైఎస్ జగన్ జమానాలో.. ఇలాంటి చిన్నెలు జరగకుండా ఉంటాయా అని పలువురి నమ్మకం. అందుకే.. ఏ సంగతి తేల్చుకోవడానికి అప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి, ఎక్సయిజు శాఖను చూసిన నారాయణస్వామిని విచారించడానికి సిట్ మరోసారి నోటీసులు జారీచేసింది.
మాజీ మంత్రి నారాయణస్వామికి గత నెలలోనే సిట్ నోటీసులు జారీచేసింది. అయితే ఆయన అనారోగ్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో పుత్తూరులోని నారాయణస్వామి ఇంటికి వెళ్లిన పోలీసులు.. విచారణకు రావాల్సిందిగా మరోసారి నోటీసులు అందించారు.
నారాయణస్వామి ఇంట్లో సిట్ పోలీసులు తనిఖీలు చేసినట్టుగా కూడా స్థానికంగా వార్తలు వచ్చాయి. అప్పట్లో తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితోనే మద్యం కొత్తపాలసీని తీసుకువచ్చిన ఫైలుపై నారాయణస్వామి సంతకాలు చేశారా అనేదిశగా పోలీసుల దర్యాప్తు సాగుతోంది. మొత్తానికి నారాయణస్వామి నోరు తెరవక తప్పని పరిస్థితి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఒకసారంటే ఆయన అనారోగ్యం సాకు చెప్పి సులువుగా తప్పించుకున్నారు. ఇప్పుడు మళ్లీ నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకుండా ఎంతకాలం తప్పించుకుని తిరుగుతారు.. అనేది పలువురి సందేహం.
ఎక్సయిజు కొత్త పాలసీ అనేది అసలు ఆ శాఖ మంత్రికి సంబంధం లేకుండానే తయారైనట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన కూడా అదే చెప్పారు. ఆశాఖ మంత్రిగా, ఫైలుపై సంతకాలు చేసి ఉండే నేపథ్యంలో.. తనకు తెలియదు అంటే కుదర్దు. మరి ఆయన సంతకాలు చేయడానికి ఎవరు ఒత్తిడి చేశారో చెప్పాల్సి ఉంటుంది. లేదా.. మద్యం నూతన పాలసీ ద్వారా దోచుకున్న మూడున్నర వేల కోట్ల రూపాయల్లో ఆయనకు కూడా ఏమైనా వాటా ఇచ్చారో లేదో అయినా ఆయన చెప్పాల్పి ఉంటుంది. ఏది చెప్పకుండా ఊరుకుంటే కుదర్దు. ఏదో బిడ్డ చచ్చినా కూడా పురిటి వాసన పోలేదన్నట్టుగా.. నారాయణస్వామికి పదవి పోయింది.. పార్టీ కూడా అధికారం కోల్పోయింది.. అధికారంలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయనకేమీ గౌరవం దక్కనూలేదు.. అయినా ఇంతా జరిగిన తర్వాత.. అప్పటి సర్కారులో తనకు సంబంధం లేకుండా జరిగిన దోపిడీలకు ఇప్పుడు తాను సమాధానం చెప్పాల్సి వస్తున్నదని ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది.