మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్డగోలుగా జగన్ దళాలు కాజేస్తే.. నిల్వ చేసిన డబ్బులను ఎవరెవరి అవసరాలకు పంచాలో, ఎన్నికల్లో ఎవరెవరి అవసరాలకు సర్దుబాటు చేయాలో.. దగ్గరుండి పర్యవేక్షించిన వ్యక్తిగా చెవిరెడ్డి భాస్కర రెడ్డిది కీలక పాత్ర. మద్యం కుంభకోణంతో తనకు సంబంధం లేదని ఆయన మీడియా కెమెరాలు కనపడగానే.. గొంతు చించుకుంటూ పొలికేకలు పెట్టవచ్చు. కానీ ఆయన పాత్ర కాదనలేనిది. ఈ విషయం పోలీసులు తమ దర్యాప్తులో నిర్ధరించారు. మొత్తం మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర గురించిన దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని కూడా పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. ఏసీబీకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఒక తీర్పు.. చెవిరెడ్డి నోటి దూకుడుకు, నోటిదురుసుతనానికి బ్రేకులు వేసేలా కనిపిస్తోంది. జైలునుంచి కోర్టుకు, కోర్టునుంచి జైలుకు తరలించే సమయాల్లో ఆయన మళ్లీ మళ్లీ ఓవరాక్షన్ చేస్తే.. ఈసారి శాస్తి తప్పదని ఆయనను హెచ్చరించేలా ఉంది.
తనకు మధ్యంతర, రెగులర్ బెయిళ్లు ఇవ్వాలంటూ చెవిరెడ్డి ఏసీబీ కోర్టులో వేర్వేరు పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ జరిగింది. ఈ రెండు పిటిషన్లను న్యాయమూర్తి వాయిదా వేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రిమాండు పోడిగింపు కోసం చెవిరెడ్డి భాస్కర రెడ్డిని కోర్టుకు తీసుకువస్తున్న ప్రతిసారీ, మళ్లీ తిరిగి తీసుకువెళుతున్న సమయాల్లోనూ ఆయన తన ప్రవర్తనతో పోలీసులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కాబట్టి ఆయనను వర్చువల్ విధానంలో కోర్టు ఎదుట హాజరుపరిచేందుకు అనుమతించాలని గత వారం సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. దీనిపై కోర్టు వాదనలు విన్నది.
చెవిరెడ్డి న్యాయవాది మాత్రం.. ఇకపై చెవిరెడ్డి అలా ఇబ్బందులకు గురిచేయరు- అంటూ కోర్టుకు హామీ పత్రం ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకుని ఏసీబీ కోర్టు సిట్ పోలీసులు వేసిన మెమోను తోసిపుచ్చంది.
ఇంతవరకు బాగానే ఉంది. వర్చువల్ విధానంలో రిమాండుకు పొడిగింపునకు హాజరైతే చెవిరెడ్డికి వచ్చే ఇబ్బంది ఏమిటో ప్రజలకు అర్థంకాని సంగతి. తరలించే ప్రతిసారీ మీడియా ముందు ఓవరాక్షన్ చేయడం కోసమే ఆయన వర్చువల్ వద్దంటున్నారా? అనేది ప్రజల అనుమానం. అలాంటి పరిస్థితుల్లో.. ఇప్పుడు చెవిరెడ్డి న్యాయవాది కోర్టుకు హామీపత్రం కూడా ఇచ్చారు. ఈసారి జైలునుంచి కోర్టుకు, కోర్టునుంచి జైలుకు తరలించే సమయాల్లో చెవిరెడ్డి ఓవరాక్షన్ చేస్తే మాత్రం.. కోర్టు సీరియస్ అయ్యే అవకాశం ఉంది. మీడియా కనపడగానే పొలికేకలు పెట్టకుండా.. చెవిరెడ్డి మర్యాదగా నడుచుకుంటే ఆయనకే మంచిది. లేకపోతే.. కోర్టు కొత్త ఆంక్షలను పెట్టగలదని పలువురు అనుకుంటున్నారు.