చంద్రబాబు కఠినంగా ఉండకపోతే డేంజరే!

కడప ఆర్టీపీపీ నుంచి వచ్చే తడి ఫ్లైయాష్ ను తరలించుకుని ఎవరు దందా సాగించాలనే విషయంలో కూటమి పార్టీల నాయకుల మధ్య ముదిరిన వివాదం ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నాయకుల మధ్య పంచాయతీని ఒక కొలిక్కి తెచ్చేందుకు పూనుకున్నప్పటికీ… జేసీ ప్రభాకర రెడ్డి స్వయంగా రాకపోవడంతో తగాదా ఇంకా ముదిరినట్టే. ఒక రకంగా చూస్తే.. జేసీ ప్రభాకరరెడ్డి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న పరిపాలన విధానాలకు లొంగకుండా, తనదైన ధోరణిలో వ్యవహరిస్తూ కొరకరాని కొయ్యగా మారారనే అభిప్రాయాలు సొంత పార్టీలోనే వ్యక్తం అవుతున్నాయి.

కడప ఆర్టీపీపీ నుంచి తడి ఫ్లైయాష్ వృథాగా ఫ్యాక్టరీ కాంపౌండ్ బయట పారబోస్తారు. కానీ.. దీనిని అమ్ముకోవడంలో రోజుకు రెండు లక్షల రూపాయలకు పైబడిన దందా ఉంటుందని తెలుస్తోంది. ఈ దందా కోసమే ఇప్పుడు నాయకుల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. కడప ఆర్టీపీపీ తడి ఫ్లైయాష్ దందా తన చేతుల్లో ఉండాలనేది జేసీ ప్రభాకరరెడ్డి వాదన. స్థానికంగా ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని, వారి అవసరాలు తీరిన తర్వాతే.. ఇతర ప్రాంతాలకు తరలించాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తెదేపా నేత భూపేష్ రెడ్డి అంటున్నారు. వీరు ముగ్గురినీ పంచాయతీ నిమిత్తం చంద్రబాబునాయుడు పిలిపిస్తే..జేసీ రాలేదు. దీంతో పీటముడి అలాగే ఉండిపోయింది.

జేసీ దివాకరరెడ్డి సాగిస్తున్న దందాల విషయంలో చంద్రబాబునాయుడు కఠినంగా వ్యవహరించకపోతే.. మొత్తంగా ప్రభుత్వం పరువు పోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. లిక్కర్ షాపులకు టెండర్లు వేయడం, తర్వాత లాటరీలు నిర్వహించిన సమయంలో జేసీ ప్రభాకరరెడ్డి బెదిరింపులు, దందాలు ఏ స్థాయిలో సాగాయో అందరూ గమనించారు. ఒకవైపు చంద్రబాబునాయుడు అసలు సిండికేట్లు కాకుండా చూడాలని, లిక్కరు వ్యాపారాల్లో తెదేపా నేతలు ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని పదేపదే మొత్తుకుంటున్నప్పటికీ.. తనకు లాభాల్లో 25 శాతం వాటా, వ్యాపారంలో పెట్టుబడితో మరో 25 శాతం వాటా ఇవ్వకపోతే.. తాడిపత్రి ప్రాంతంలో ఎవ్వరినీ లిక్కరు షాపు నడుపుకోనివ్వను అని బహిరంగంగా హెచ్చరించడం ద్వారా జేసీ అనేక వివాదాలకు కారణం అయ్యారు. ఈ విషయంలో ఇప్పటికైనా చంద్రబాబు కఠినంగా వ్యవహరించకపోతే.. పార్టీ, ప్రభుత్వం పరువు మరింత పోతుందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories