అయిదేళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీకటిరోజులు ప్రాప్తించాయి. జగన్ రాగానే.. విధ్వంస పాలన మొదలైంది. రాష్ట్రం ఏ రంగంలో అయినా ఒక అడుగు ముందుకు వేయడానికి సాగిస్తున్న ప్రస్థానం యావత్తూ స్తంభించిపోయింది. కూల్చివేతల ప్రభుత్వంగా పాలన మొదలు పెట్టడం మాత్రమే కాదు.. ప్రగతిని ఎక్కడికక్కడ స్తంభింపజేసేశారు. 70 శాతం పూర్తయిన పోలవరం ఆగిపోయింది. అదేస్థాయిలో నిర్మాణాలు చాలా వరకు జరిగిన అమరావతి ఆగిపోయింది. అంతే కాదు..
జగన్ పాలన తొలిరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సామాన్యుడు కట్టుకునే ప్రతి నిర్మాణమూ ఆగిపోయింది. ఇసుక సరఫరా నిషేధించి, నిర్మాణ పనుల్ని స్తంభింపజేసి.. వేలాది మంది భవన నిర్మాణ కార్మికులను బలితీసుకున్న, లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు ఆకలితో అలమటించేలా చేసిన దుర్మార్గుడి జగన్ పేరు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత కూడా జగన్ కొత్త ఇసుక విధానం పేరుతో సరికొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారు. సామాన్యులకు చంద్రబాబు సర్కారు ఉచితంగా ఇస్తూ వచ్చిన ఇసుక ధరను అమాంతం ఆకాశానికి పెంచేశారు. పైగా ఇసుక విక్రయాల ముసుగులో అడ్డగోలు దందాలకు తెరలేపారు. దేశంలో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. కిళ్లీ బంకులో సిగరెట్టు కూడా డిజిటల్ పేమెంటుతో దొరుకుతుంది. కానీ.. దేశవ్యాప్తంగా కేవలం రెండే వ్యాపారాలలో డిజిటల్ చెల్లింపులు అనేవి అస్సలు లేకుడా చెలాయించారు. ఆ వ్యాపారాలు.. ఏపీలో లిక్కరు, ఇసుక! ఇసుక వ్యాపారంలో చివరిదాకా కేవలం నగదు చెల్లింపుల మీద మాత్రమే విక్రయించారు. కేవలం అక్రమ దందాల కోసమే ఇలా చేస్తూ వచ్చారు. ఈ సమస్త దోపిడీ పర్వానికి చంద్రబాబు కొత్త ప్రభుత్వం చెక్ పెడుతోంది.
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా ప్రజలకు ఇసుకు ఉచితంగా సరఫరా చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తే గనుక.. యావత్తు రాష్ట్రప్రజలు చంద్రబాబును నెత్తిన పెట్టుకోవడం గ్యారంటీ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.