కలెక్టర్ల సదస్సులో చంద్రబాబునాయుడు ఒక సరికొత్త ఆలోచనను చర్చకు తెచ్చారు. ఈ కొత్త ఆలోచన కార్యరూపంలోకి వస్తే గనుక.. రాష్ట్రంలోని రైతులు చంద్రబాబునాయుడుకు నీరాజనం పట్టే అవకాశం ఉంది. ఆయనను నిర్ణయం రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురాగలిగిన అద్భుతం అవుతుందనే విశ్లేషణలు అప్పుడే వినిపిస్తున్నాయి. ఇంతకూ చంద్రబాబు చేస్తున్న సరికొత్త ప్రతిపాదన ఏంటో తెలుసా?
అమరావతి రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ రూపంలో రైతులందరరూ తమ పొలాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రూపంలో ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, కొనుగోలు చేయకండా దాదాపు యాభై వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం సమీకరించింది. దీనివలన అక్కడ రాబోయే సరికొత్త నగరంలో భూములు ఇచ్చిన రైతులందరూ కూడా స్థలాలకు యజమానులు అవుతారు. చిన్నవో పెద్దవో రాజధాని ప్రాజెక్టులో వచ్చే ఆస్తుల్లో వ్యాపారాల్లో వారికి వాటాలు ఉంటాయి. రైతులు భూములు ఇచ్చిన దామాషాలో వారికి అభివృద్ధి చెందిన నగరంలో ప్లాట్లు కేటాయిస్తున్నది సర్కారు. ఆ రకంగా రైతులు ఎక్కువ లాభపడుతున్నారు.
ఇదే సిద్ధాంతాన్ని రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కూడా వర్తింపజేయాలని చంద్రబాబునాయుడు ప్రతిపాదిస్తున్నారు. అమరావతి మోడల్ లోనే.. రైతులనుంచి పరిశ్రమలు ఏర్పాటు చేయదలచుకునే వారికి భూములు ఇప్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మోడల్ వలన.. పారిశ్రామిక సెజ్ లు ఏర్పాటు అవుతున్న ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు తమకు రవాణా వసతులు, మానవ వనరులు ఎక్కడ అనుకూలంగా ఉంటాయని భావిస్తే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం వీలవుతుంది. రైతులనుంచి వారు పొలాలు తీసుకోగలుగుతారు. ఆ దామాషాలో రైతులు ఆయా కంపెనీలలో భాగస్వాములు అవుతారు. లేదా, తదనుగుణమైన లబ్ధిని పొందుతారు. కంపెనీలు వస్తే.. ఆయా కంపెనీల చుట్టు పక్కల ప్లాట్ల రూపంలో స్థలాలు ఇచ్చిన రైతులకు తిరిగి ఆస్తులు దక్కినా కూడా వారికి శాశ్వతమైన ఉపాధి మార్గాలు ఏర్పడుతాయి. కంపెనీలను బట్టి.. రైతులు ఇచ్చి భూమిని బట్టి.. ఆయా కంపెనీలోనే వారికి వాటాలు దక్కితే గనుక.. ఇక రైతులు తమ జీవితాల గురించి వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సంపద సృష్టి అంటే ఏమిటో ప్రజలకు నిరూపించి చూపించే మోడల్ ఇది. చంద్రబాబునాయుడు ఇలాంటి ప్రతిపాదనను కార్యరూపంలోకి తెస్తే.. ప్రజలందరూ అద్భుతంగా ఆదరించే అవకాశం ఉంది.