చంద్రబాబు పోటీపెట్టకుంటే లాస్ అవుతాం!

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక వ్యవహారం రసవత్తరంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీ బరిలోకి అభ్యర్థిని దింపుతుందా లేదా? అనేది సందేహంగా ఉంది. చంద్రబాబు ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నారు. పోటీపెట్టాలని తొలుత అనుకున్నప్పటికీ.. కేవలం వైసీపీ నుంచి పడగల క్రాస్ ఓటింగ్ మీద  ఆధారపడాల్సి రావడంతో  చేద్దామా?

వద్దా? అనే ఆలోచనలో పడ్డారు. అయితే చంద్రబాబు పునరాలోచన నేపథ్యంలో.. తెలుగుదేశం పోటీగురించి వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లోనే ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ పోటీచేస్తేనే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ముందుగానే జాగ్రత్త పడింది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధుల్ని కుటుంబాలతో సహా బెంగుళూరుకు తరలించారు. వారికి మధ్యలో తాడేపల్లిలో జగన్ తో  ఒక చిన్న భేటీ ఏర్పాటు చేయించి మరీ.. బెంగుళూరు శిబిరాలకు తరలించారు. కుటుంబాల సహా వారిని విహారయాత్రల్లో ఉంచినట్టుగా తెలుస్తోంది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే వైసీపీకి చెందిన ఓటర్లలో తెలుగుదేశం పోటీచేయాలనే కోరిక వ్యక్తమవుతోంది.

తెలుగుదేశం పోటీలో ఉంటే గనుక.. తమ కుటుంబసమేత విహార యాత్రలు పోలింగ్ జరిగే రోజు వరకు కొనసాగుతాయని.. తామందరినీ పోలింగ్ నాటికి తిరిగి వెనక్కు తీసుకువెళతారని వారు అంటున్నారు. అలా కాకుండా.. తెలుగుదేశం పోటీచేయకపోతే.. నామినేషన్ల గడువు ముగిసిన రోజునే తమ విహారయాత్రలు కూడా ముగిసిపోతాయని వారు  ఆందోళన చెందుతున్నారు. కుటుంబాలతో సహా సకల భోగాలతో కొన్ని ఎక్కువ రోజులు విహారాల్లో గడపాలంటే.. తెదేపా పోటీచేయాల్సిందే అంటున్నారు.

అదే తరహాలో.. ఆర్థిక ప్రయోజనాల గురించి కూడా వారిలో చర్చ నడుస్తోంది. బొత్స సత్యనారాయణ ఆర్థికంగా బలమైన  నాయకుడు గనుక.. తెలుగుదేశం రంగంలోకి పోటీ అంటూ ఉంటే.. ప్రతి ఓటరుకు లక్షల్లో డబ్బు ముట్టజెప్పడం జరుగుతుందని.. పోటీ అంటూ లేకపోతే.. తమకు నయాపైసా కూడా గిట్టుబాటు కాదని వారు అనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని వారంతా కోరుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories