బెయిలిస్తే వంశీ కూడా దేశానికే పరారవుతారా?

తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయంలో పనిచేసే దళిత యువకుడు ముదునూరి సత్యవర్ధన్ ను కిడ్నాప్  చేసి నిర్బంధించడం, ఎస్సీ ఎస్టీకోర్టులో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి.. తన మీద ఉన్న కేసును తేల్చేయడానికి కుట్రపన్నడం వ్యవహారాల్లో వల్లభనేని వంశీ ప్రస్తుతం రిమాండులో జైల్లో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లుగా బెయిలు కోసం ఆయన దరఖాస్తు చేసుకుని, కోర్టు ఎదుట విఫలం అవుతున్నారు కూడా. ఆయన బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారుచేసేస్తారనే వాదనతోనే పోలీసులు ఇప్పటిదాకా బెయిలు పిటిషన్లను అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఆయన బయటకు వస్తే తన అనుచరులందరూ తలదాచుకుంటున్న మరోదేశానికి పారిపోయే అవకాశం కూడా మెండుగా ఉన్నదని పోలీసులుసేకరించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
వంశీ అరెస్టుకు ముందు, బయట ఉండగా.. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులోంచి తప్పించుకోవడానికి సత్యవర్ధన్ కిడ్నాప్ ద్వారా ఎలాంటి కుట్ర చేశారో ఇప్పుడు అందరికీ తెలుసు. ఆయన బెయిలుకు ఆ కుట్రే అడ్డంకిగా మారింది. మళ్లీ బయటకు వస్తే ఇంకా అలాంటి అనేక కుట్రలు, సాక్ష్యాల తారుమారు కోసం చేస్తారనేది పోలీసుల వాదన.

కాగా.. సత్యవర్దన్ కిడ్నాప్ కు సంబంధించి.. కీలకమైన ఇంకా కొందరు నిందితులు పరారీలోనే ఉన్నారు. వంశీ అనుచరులైన వారందరూ కూడా నేపాల్ లో ఉన్నట్టుగా పోలీసులు సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఏ1 నిందితుడైన వంశీ అనుచరుడు రంగాను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. రంగాతో సమానమైన పాత్ర ఉన్న మరో నిందితుడు కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కోట్లు, మరికొందరు నేపాల్ లో తలదాచుకుని ఉన్నట్టుగా తెలుస్తోంది.

వంశీ అనుచరులు, వారి సన్నిహితుల ఫోన్లను పోలీసులు అబ్జర్వేషన్ లో పెట్టారు. వారు అక్కడే ఉంటూ రాత్రివేళల్లో తమ మిత్రులకు ఫోనుచేసి పోలీసుల కదలికల గురించి తెలుసుకుంటున్నట్టుగా పోలీసునిఘావర్గాలు కనిపెట్టాయి. నేపాల్లో మొత్తం నలుగురు ఉన్నారని, వారు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అయితే ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నది ఏంటంటే.. వల్లభనేని వంశీకి ఇప్పుడు బెయిలు వస్తే ఆయన కూడా నేపాల్ పారిపోయే ప్రమాదం ఉన్నదని అనుకుంటున్నారు. కేసులు పడిన నాయకుల మీద లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయితే విమానాశ్రయాల్లోంచి వెళితే దొరికిపోతున్నారు. నిన్నటికి నిన్న కడప వైసీపీ నేత అహ్మద్ బాషా దొరికిపోయారు. అందుకే రోడ్డు మార్గంలో కేవలం ఆధార్ కార్డు చూపించి వెళ్లిపోగలిగే.. నేపాల్ కు పారిపోతే.. అక్కడ తలదాచుకోవచ్చునని ప్లాన్ చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ లో ఉన్న నిందితులు, వంశీ అనుచరులు కూడా దొరికేవరకు.. అందరినీ కలిపి ఉమ్మడిగా విచారించే వరకు వంశీకి బెయిలు రాకపోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories