విరాళంగా ఆలయం కడితే.. మీకు నొప్పేంటి సార్?

తిరుమల తిరుపతి దేవస్థానాల వారు దేశంలో అనేక ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు. సాధారణంగా గతంలో టీటీడీకి ఉండే  డబ్బుతోనే వివిధ ప్రాంతాల్లో ఆలయాలు, కల్యాణ మండపాలు నిర్మిస్తూ ఉండేవారు. ఊర్లలో, నగరాల్లో ఎవరైనా స్థలాన్ని విరాళంగా టీటీడీకి అప్పగిస్తే గనుక.. అక్కడ టీటీడీ డబ్బుతో నిర్మాణం జరిగేది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. శ్రీవాణి ట్రస్టు అంటూ కొత్తది ప్రారంభించి.. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను 10వేల రూపాయలకు విక్రయిస్తూ.. ఆ సొమ్ము మొత్తం దేశవ్యాప్తంగా ఆలయాలు కట్టడానికే వినియోగిస్తామంటూ పలుచోట్ల నిర్మాణాలు చేపట్టారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ధర్మప్రచారంలో భాగంగా, వేంకటేశ్వర ఆలయాల విస్తృతికోసం దేశవ్యాప్తంగా ఉండే అన్ని రాజధాని నగరాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం అని చంద్రబాబునాయుడు ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో పాటు అందుకోసం స్థానికంగా విరాళాలు కూడా సేకరిస్తాం అని చంద్రబాబు ప్రకటించారు. ఇంతవరకు అంతా క్లియర్ గానే ఉన్నది కదా? మరి చెన్నైలో ఒక సంస్థ టీటీడీ వారు ఇచ్చే నమూనా ప్రకారం ఒక వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పూర్తిగా తమ సొంత ఖర్చుతో విరాళంగా నిర్మించి, టీటీడీకి అప్పజెబుతాం అని అంటోంటే.. అందుకు వైసీపీ నాయకులు ఎందుకంతగా గగ్గోలు పెడుతున్నారో ఎవ్వరికీ అర్థం కావడంలేదు.

వేంకటేశ్వర స్వామి వైభవాన్ని దేశవ్యాప్తం చేయడానికి.. టీటీడీ అనేక ఆలయాలు నిర్మిస్తూ వస్తోంది. చిన్న చిన్న దళిత వాడల దగ్గరినుంచి జమ్మూ కాశ్మీరు వరకు ఎన్నోచోట్ల ఆలయ నిర్మాణాలు టీటీడీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన డబ్బు మొత్తం దీనికే ఖర్చు పెడుతుండేవారు. చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాత మెరుగైన ఆలోచన చేశారు. నగరాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేప్పుడు.. అక్కడ స్థలాన్ని ప్రభుత్వాల ద్వారా లేదా స్థానికుల ద్వారా తీసుకుంటూ ఉన్నట్టే.. నిర్మాణానికి కూడా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు.

దీనిద్వారా టీటీడీకి లాభమే తప్ప నష్టం లేదు. స్వామి వారి ఆలయ నిర్మాణం అంటే.. ఆ ఆలయం టీటీడీ నిర్వహణలోనే ఉంటుందంటే.. ఏ నగరంలో అయినా భూరివిరాళాలు ఇవ్వడానికి ఎగబడి వచ్చే సంపన్న భక్తులు ఎంతో మంది ఉంటారు. వారందరికీ సహజంగా ఏదో ఒక వ్యాపారం ఉండనే ఉంటుంది. అంతమాత్రాన.. తమ తమ వ్యాపారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా దేవుడిని వాడుకుంటున్నారని అర్థం కాదు.
ఆ మాట కొస్తే.. తిరుమలలో టీటీడీ స్థలం కేటాయిస్తే.. కోటీశ్వరులు కొందరు.. అతిథిభవనాలు నిర్మించి టీటీడీకే విరాళంగా ఇస్తున్నారు. అంత మాత్రాన ఆ భవన నిర్మాణం చేపట్టినందుకు వారు మార్కెట్ చేసుకుంటున్నారని అనుకోవాలా? కాదు కదా.. అనేది ప్రజల వాదన.

విరాళాలతో శ్రీవారి ఆలయం నిర్మాణం పద్ధతిలోనే.. చెన్నైలో ఒక సంస్థ టీటీడీ ఇచ్చే నమూనాలో ఆలయం కట్టడానికి, టీటీడీకి అప్పగించడానికి ముందుకు వచ్చింది. ఆ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నమాట నిజం. స్థలమూ, నిర్మాణమూ సమస్తమూ వారే భరించడానికి ముందుకొచ్చారు. అంత మాత్రాన.. తమ వెంచర్లలో స్థలాలు కొన్నవాళ్లు మాత్రమే ఆ దేవుడిని దర్శించుకోవాలని, బయటివారికి అనుమతి లేదని అనడం లేదు కదా. నిజానికి నిర్మాణం తర్వాత ఆ ఆలయం టీటీడీ ఆస్తి అవుతుంది కదా.. మరి అలాంటప్పుడు మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గానీ, వైసీపీ నాయకులు గానీ ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావడం లేదు. పూర్తి విరాళంగా ఆలయం ఏర్పాటు అవుతోంటే.. వారు ఓర్వలేకపోతున్నారేమో అనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories