‘మాటలు కోటలు దాటుతాయి గానీ.. చేతలు గుమ్మం కూడా దాటవు’ అనే సామెత ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు అతికినట్టుగా సరిపోయేలా ఉంది. ఎందుకంటే.. వైఎస్సార్ సీపీ నాయకులకు గుండెల్లో ధైర్యం ఇసుమంతైనా లేదు.. కానీ వారి ప్రగల్భాలు మాత్రం.. తక్షణం ఎన్నికలకు వెళ్లిపోయేలా ఉన్నాయి. ఈ పోకడ కేవలం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో మాత్రమే కాదు.. ఆ పార్టీకి చెందిన సభ్యులందరిలోనూ అదే ధోరణి. ఇప్పటికే రెండు కేసుల్లో జైలులో గడిపి బెయిలు తెచ్చుకున్న మాజీ ఎంపీ నందిగం సురేష్.. కొత్తగా మరో కేసులో ఇరుక్కుని అందులో కూడా బెయిలు తెచ్చుకున్నారు. చివరకు ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి లెవెల్లో సవాళ్లు విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎన్డీయే కూటమి పార్టీలకు సింగిల్ డిజిట్ లో కూడా సీట్లు వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
నందిగం సురేష్ కు కొత్తగా మరొక బెయిలు వచ్చింది గనుక.. ఆయన తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి తన సందేశం వినిపించారు. వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టు చేయించడం మీదనే కూటమి ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెడుతున్నదని.. తమ పార్టీ నాయకులను వేధించడం తప్ప.. వారు పరిపాలన పూర్తిగా మరచిపోయారని సురేష్ సెలవిచ్చారు. వారు ఇలా చేస్తే.. ఇవన్నీ తాము గుర్తు పెట్టుకుంటామని.. మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇదే సంగతి రిపీట్ అవుతుందని కూడా పేర్కొన్నారు. ఇక్కడితో ఆగలేదు.
ప్రజల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పట్ల ఎనిమిది నెలల్లోనే విపరీతంగా అసంతృప్తి పేరుకుపోయిందిట. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఆయన చంద్రబాబునాయుడుకు ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. చంద్రబాబు తన పరిపాలన గురించి.. తక్షణం రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించుకోవాలట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినట్లయితే.. కూటమి పార్టీలు అన్నింటికీ కలిపి సింగిల్ డిజిట్లో కూడా ఎమ్మెల్యే స్థానాలు దక్కే అవకాశం లేదుట. మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందట. నందిగం చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఒకవైపు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు, టీచరు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతోంటే.. బరిలోకి దిగడానికి కూడా దమ్ముల్లేని పార్టీ.. ఎమ్మెల్యే ఎన్నికలు వస్తే మాత్రం.. కనీసంగా 166 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పేవారి గురించి ఏం అనుకోవాలి? అంటూ జనం నవ్వుకుంటున్నారు. మేకపోతు గాంభీర్యంతో మాట్లాడడం.. తమ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా సరే.. పైకి మాత్రం బింకం సడలకుండా డబాయింపు డైలాగులు వల్లించడం రాజకీయాల్లో సర్వసాధారణమే! ఏ నాయకులైనా ఇలా మాట్లాడుతుంటారు. కానీ.. ప్రత్యేకించి వైసీపీ నాయకులు, వారి అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొన్నాళ్లు పూర్తిగా నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంటుంది.