రాష్ట్రంలో అధికార మార్పిడి జరగబోతున్నది అనే సంగతి ముందుగా అధికార వర్గాలలోనే బాగా వ్యాపిస్తుంది. కీలక స్థానాలలో ఉండే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లలోని తమకు సన్నిహితులైన కీలక నాయకులను ఆశ్రయిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు ప్రాధాన్యత ఉండే పోస్టులు కావాలని పరోక్షంగా ఇప్పటినుంచే మంతనాలు సాగిస్తున్నారు. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కన్నూమిన్నూ కానకుండా చెలరేగి పోయిన అధికారుల సంగతి ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. వారు కూడా తమకు పరిచయం ఉన్న ఇతర వ్యక్తులను, నేతలను వెంటబెట్టుకుని తెదేపా పెద్దలను ఆశ్రయిస్తున్నారు. తాము ఉద్యోగంలో భాగంగా ప్రభుత్వంలోని వైసీపీ వారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సి వచ్చిందే తప్ప తెలుగుదేశం మీద గాని చంద్రబాబు నాయుడు మీద కానీ తమకు ఎలాంటి ద్వేషం లేదని ఇప్పటినుంచే సంజాయిషీలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత స్థానాలలో ఉండే కీలక అధికారులు ప్రత్యేకంగా సేకరించిన అంచనాలలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఘనమైన మెజారిటీతో ఏర్పడబోతున్నది అనే సంకేతాలు అందినట్లు సమాచారం. దీంతో అధికార గణాలు ఇప్పుడు తమ రూటు మారుస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే.. ఏ రోటి కాడ ఆ పాట పాడే వైఖరి మనకు కొత్త కాదు. కానీ రాజకీయ నాయకుల మాదిరిగా- అధికారులు కూడా గద్దెనెక్కబోయే వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడుతుండడం విశేషం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లూప్ లైన్ లో ఉండిపోయిన అధికార్లకు ఈ పరిణామాలు హేపీగానే ఉన్నాయి. ఎటొచ్చీ.. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే.. తమను ఆదరిస్తుందని వారు అనుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం, తమ అడుగులకు మడుగులొత్తని, తమ మాటకు ఎదురు చెప్పే అనేక మంది అధికార్లను గత అయిదేళ్లలో పక్కన పెట్టింది. అప్రాధాన్య పోస్టుల్లో ఉంచింది. వారంతా ఇప్పుడు తమకు మంచిరోజులే అనుకుంటున్నారు. మరొకవైపు.. లోకేష్ పదే పదే ప్రస్తావించిన రెడ్ డైరీలో తమ పేర్లు ఉంటాయనే భయం ఉన్న అధికారులు మాత్రం వణికిపోతున్నారు. తెలుగుదేశం పెద్దలను ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. మరి వారి ఈ అవకాశవాద ప్రయత్నాలను తెలుగుదేశం ఎలా తీసుకుంటుందో, ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.