బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్, ఒకప్పటి సినీ హీరోయిన్ రాణీ ముఖర్జీలకు తాజాగా అరుదైన గౌరవం అందింది. వారిద్దరూ ఆగస్టు 13న ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హౌస్‌లో ప్రసంగించేందుకు ఆహ్వానాన్ని అందుకున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 15వ వార్షికోత్సవం నేపథ్యంలో కరణ్ జోహార్ – రాణీ ముఖర్జీ అంతర్జాతీయ వేదిక మీద ప్రసంగించబోతున్నారు
అయితే, తాజాగా ఈ ఆహ్వానం పై హీరోయిన్ రాణి ముఖర్జీ తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హౌస్ లో భారత చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం నాకు రావడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. సినిమా ప్రపంచానికి మనం అందించిన గొప్ప చరిత్ర గురించి మాట్లాడనున్నాను. సినిమా ద్వారా భారత్, ఆస్ట్రేలియాల మధ్య పెరుగుతోన్న సాంస్కృతిక సంబంధాల గురించి కూడా ఆ వేదిక మీద ప్రసంగించనున్నారు. ఏది ఏమైనా ఈ ఆహ్వానాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ రాణి ముఖర్జీ ఓ ప్రకటనను విడుదల చేసింది.