ఐ-ప్యాక్ దళం జగన్‌ను ముంచిన విధంబెట్టిదనిన..

జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ సాంతం మునిగిపోయాయి. మళ్లీ కోలుకుంటారో లేదోనని భయం పుట్టేంత పెద్ద దెబ్బ పడింది. జగన్మోహన్ రెడ్డి.. కాంతిలేని మొహంతో.. ఎవరు ఎన్ని చేసినా తమ పార్టీ యొక్క పరిస్థితిని 40 శాతం కంటె తక్కువకు నెట్టలేకపోయారని ధైర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు పంచిపెడితే.. ఆ మాత్రం 40 శాతం ఓటు బ్యాంకు రికార్డుల్లో మిగిలిందో అందరికీ తెలుసు. అయితే ఇంత దారుణమైన ఓటమి అసలు ఎలా సాధ్యమైంది? 175 సీట్లు గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన వ్యక్తి.. కనీసం 17 కూడా గెలవలేకపోయాడే? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. ఈ ఓటమికి మూలకారణం ఎవ్వరు? ఏమిటి? అనే చర్చ కూడా ప్రజల్లో నడుస్తోంది. అయితే జగన్ పరాజయానికి ఒక కీలక కారణం మాత్రం ఐప్యాక్ వారి వ్యూహ, ప్రచార సారథ్యం అని పలువురు భావిస్తున్నారు.

జగన్.. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. ట్వీటు ద్వారా తప్ప మీడియా ముందుకు వచ్చి ప్రజలకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. అసలు ఎక్కడా బయట సంచరించలేదు. కానీ ఐప్యాక్ కార్యాలయానికి మాత్రం వెళ్లారు. తద్వారా ఆ ఐప్యాక్ బృందాలు తనకు ఎంత ముఖ్యమో ఆయన చెప్పకనే చెప్పారు. అయితే విశ్లేషకులు భావిస్తున్న దానిని బట్టి.. ఐప్యాక్ వారి వ్యూహాలు వికటించి, వారి డ్రామాలు ఎబ్బెట్టుగా మారి ప్రజలు ఛీత్కరించుకోవడం వలన ఓటమి వరించిందని తెలుస్తోంది.

గత అయిదేళ్లపాటూ ఐప్యాక్ ఏం చేసింది.. అనే సంగతి కాస్త పక్కన పెట్టండి.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించారు. యాత్ర పొడవునా.. స్టే చేసిన ప్రతిచోటా స్థానిక ప్రజలతో నాయకుడు ఇంటరాక్ట్ అయ్యే ఒక కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమం బహిరంగంగా కాకుండా, ఇండోర్ లో అంటే కల్యాణ మండపాల్లోనో, అలాంటిఇతర హాళ్లలోనో జరిగేది. ఇక్కడ సాధారణంగా పెద్ద పెద్దకామెడీ ఎపిసోడ్లు నడుస్తుండేవి.

ఇక్కడకు వచ్చే ప్రజలను ఐప్యాక్ బృంద సభ్యులే కోఆర్డినేట్ చేస్తుండేవారు. అంటే కేవలం అక్కడ జగన్ తో మాట్లాడే అవకాశం దక్కే ప్రజలను గ్రామాలనుంచి తోలుకు రావడం మాత్రమే కాదు. వారికి ఐప్యాక్ బృందాలే శిక్షణ కూడా ఇచ్చేవి. ఏం మట్లాడాలి.. ఎలా మాట్లాడాలి.. జగన్ ను ఎలా పొగడాలి.. జగన్ స్కీములను ఆకాశానికెత్తేస్తూ ఏమేం చెప్పాలి నేర్పేవాళ్లు. వాళ్లు ఆ కార్యక్రమంలో నాటకం ఆడుతున్నట్టుగా అదంతా అప్పజెప్పి వెళ్లేవాళ్లు. ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో హోరెత్తించడం వారి పని. అలాగే బస్సు యాత్రలో రోడ్ల మీద కూడా.. జనం వచ్చి జగనన్న కాళ్లు మొక్కి.. ఆయన దీవెనలు తీసుకుని.. ఆయన పథకాల్ని పేరుపేరునా చెప్పి మరి కొనియాడడం… లాంటి జుగుప్స కలిగించే డ్రామాలనీ ఐప్యాక్ వారి ప్లానింగ్ పుణ్యమే. ఇలాంటి అతి వేషాలు.. టోటల్ గా జగన్ పరువు తీశాయని, జనానికి ఎబ్బెట్టుగా అనిపించి.. ఆయన పాలనంటే చీదర పుట్టిందని పలువురు అనుకుంటున్నారు. మొత్తానికి అనేక రకాల ప్రయత్నాలతో జగన్ మీద ప్రజల్లో అసహ్యం పుట్టేలాగాచేసి ఐప్యాక్ జగన్ కొంపముంచిందని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories