ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హృతిక్ రోషన్ తన అనుభవాలను పంచుకున్నారు. తెలుగు ప్రేక్షకుల మద్దతు తనకు ఎప్పుడూ ప్రత్యేకమని, ‘వార్’, ‘క్రిష్’, ‘ధూమ్ 2’ వంటి చిత్రాలకు ఇక్కడ మంచి స్పందన లభించిందని ఆయన గుర్తు చేశారు. ‘వార్ 2’ కూడా అలాంటి వినోదాన్ని అందిస్తుందని, ఈ సినిమా కోసం టీమ్ ఎంతో కష్టపడ్డామని తెలిపారు.
సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను కూడా హృతిక్ ఆసక్తిగా వివరించారు. యాక్షన్ సన్నివేశాల్లో ఇద్దరూ పలుమార్లు గాయపడినప్పటికీ, ఎన్టీఆర్ మాత్రం నొప్పిని పట్టించుకోకుండా సీన్స్ పూర్తి చేశారని చెప్పారు. ఆ క్రమశిక్షణ, పట్టుదల తనకు స్ఫూర్తి కలిగించిందని, తారక్‌లో తనని తాను చూసుకున్నానని అన్నారు. ఎన్టీఆర్ ఒక్క షాట్‌లోనే పూర్తి నాణ్యతతో నటించే అరుదైన ప్రతిభ కలవారని, తనకూ ఆ పద్ధతి అలవాటు చేసుకోవాలని భావిస్తున్నానని తెలిపారు.
ఇక నటుడిగా మాత్రమే కాకుండా, ఎన్టీఆర్ మంచి వంటవాడని కూడా హృతిక్ చెప్పారు. ఈసారి ఆయన చేతి బిర్యానీ తప్పకుండా రుచి చూడాలనే కోరిక వ్యక్తం చేశారు. ‘వార్ 2’లో ఈ ఇద్దరి కలయిక కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.