గ్లోబల్ బ్యూటీ ‘ప్రియాంక చోప్రా గ్లామర్, డీ గ్లామర్… ఇలా ఏ పాత్రలోనైనా అలా నటించేసి మెప్పించగల నటి అన్న విషయం తెలిసిందే. అయితే, ఇలాంటి నటి మొదట్లో సినిమా రంగంలోకి రావడానికి ఇష్టపడలేదంట. ఈ విషయం గురించి తాజాగా ప్రియాంక తల్లి మధు చోప్రా ఓ విషయం చెప్పారు. దీని గురించి మధు చోప్రా మాట్లాడుతూ.. ‘ప్రియాంక అప్పట్లో మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు సినిమాల్లో అవకాశాలు చాలా వచ్చాయి.
కానీ, ప్రియాంకకి సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదు. చదువులో కొనసాగుతూ.. క్రిమినల్ సైకాలజిస్ట్‌గా, లేకపోతే ఏరోనాటికల్ ఇంజినీర్‌గా అవ్వాలని లక్ష్యం పెట్టుకుంది’ అంటూ మధు చెప్పుకొచ్చారు.
ప్రియాంక సినీ ఎంట్రీ గురించి మధు చోప్రా ఇంకా మాట్లాడుతూ.. ‘విధికి వేరే ప్లాన్స్ ఉంటాయి కదా. వరుస ఆఫర్లు వస్తుంటే.. చదువులు ఎక్కడికి పోవు, ఒక్క సినిమాలో నటించమని నా కూతుర్ని నేనే ఒత్తిడి పెట్టాను. అలా నా బలవంతంతో తన మొదటి చిత్రానికి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రియాంక సైన్ చేసింది. ఆ తర్వాత మాత్రం సినిమాల్లోనే నటించాలని ప్రియాంక నిర్ణయించుకుంది’ అంటూ మధు చోప్రా చెప్పింది. ఇక ‘ప్రియాంక చోప్రా’ నిక్ జోనస్ ను 2018లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.