ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న పింఛనర్ల ఓట్లు గంపగుత్తగా సైకిలు గుర్తుకు, వారి భాగస్వామ్య పార్టీల గుర్తులైన కమలం, గాజు గ్లాసుకే పడబోతున్నాయా? ఏపీలో ఈ దఫా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు తీసుకుంటున్న వారే కీలకభూమిక పోషించబోతున్నారా? అంటే అవుననే సమాధానమే సర్వత్రా వినిపిస్తోంది. పెన్షనర్ల ఓట్లు తెలుగుదేశానికి పడకుండా కట్టడి చేయడం ఎలా? అనేది వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎదురవుతున్న కొత్త తలనొప్పిగా ఉంటోంది.
సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసిన తర్వాత చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాలు పొందుతున్న పెన్షనర్లకు ప్రకటించిన వరం.. ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పాలి. సుమారు నెలరోజుల కిందట తన వాగ్దానాన్ని సభల్లో ప్రకటించిన చంద్రబాబునాయుడు తాజాగా తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆ విషయం ప్రస్తావించారు. ఆ హామీ ఇప్పటికే మారుమూల గ్రామాల్లో ఉన్న పెన్షనర్లకు కూడా బాగా రీచ్ అయింది. జగన్మోహన్ రెడ్డి.. తన దృష్టిలో ప్రజలు అంటే కేవలం ఓట్లు తప్ప మరొకటి కాదు అన్నట్టుగా.. ప్రస్తుతం మూడు వేలు ఉన్న పెన్షన్లను 2029 ఎన్నికలకు ముందు రెండేళ్ల పాటు 250 వంతున పెంచుతానని హామీ ఇవ్వడం కేవలం వారిని హేళన చేయడం లాంటిదే అని పలువురు భావిస్తున్నారు.
చంద్రబాబునాయుడు వారికి ఘనమైన హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి పెన్షను నాలుగు వేలకు పెంచి.. తమ ప్రభుత్వం రాగానే జులైనెలలో అరియర్స్ మూడువేలతో పాటు మొత్తం ఏడువేల రూపాయలను వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే అందజేస్తాం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ హామీని తెలుగుదేశం శ్రేణులు ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాయి. పెన్షనర్ల ఓట్లు తెలుగుదేశానికి, కూటమి పార్టీలకు గంపగుత్తగా పోలయ్యే పరిస్థితి. అయితే వారికి ఓట్లు పడకుండా చేయడం ఎలా అని వైసీపీ దళాలు తలలు పట్టుకుంటున్నాయి.
చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మరు, ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోరు.. అనే ఒక్క వాదన తప్ప.. జగన్ వద్ద మరో అస్త్రం లేదు. జగన్ ను గెలిపిస్తే.. ఇప్పుడు వచ్చేదే వస్తుంది. అదే చంద్రబాబుకు ఓటువేస్తేపెంచిన పెన్షను వస్తుంది, ఆయన గెలవకపోయినా ఇప్పుడున్నది ఎటూ వస్తుంది.. అనే ఉద్దేశంతో పెన్షనర్లు సిద్ధమవుతున్నారు. ఈ దెబ్బ వైసీపీకి మామూలుగా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.