సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీనుంచి సస్పెండ్ అయ్యారు. దాని వలన ఆయన ఎమ్మెల్యే పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేకపోవచ్చు. కానీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఏ విశ్వాసంతో అయితే చంద్రబాబునాయుడు ఆయనను ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినా సరే.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆదరించారో ఆ నమ్మకం దెబ్బతింటుంది! కోనేటి ఆదిమూలం నిజంగానే.. ఒక మహిళను లైంగికంగా వేధించారా? లేదా చంద్రబాబునాయుడు వద్ద ఆయనకున్న నమ్మకాన్ని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా ఎవరైనా ఈ ఎపిసోడ్ మొత్తం నడిపించారా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. దీని వెనుక కుట్ర ఉన్నదనే వ్యాఖ్యలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. కేవలం ఆయన క్రెడిబిలిటీ దెబ్బతీయదలచుకున్న స్థానిక తెలుగుదేశంలోని ఒక వర్గం నేతలు మాత్రమే కాదు.. వైసీపీ ఉద్ధండులు కూడా ఈ కుట్రలో భాగస్వాములే అని తెలుస్తోంది.
తమ తండ్రి మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కోనేటి ఆదిమూలం కుమార్తెలు ఖండించడంలో వింతేమీ లేదు. ఆయనకు హార్ట్ ఎటాక్, కోవిడ్ వచ్చినప్పటినుంచి ఒక అల్లుడు నిత్యం ఆయన పక్కనేఉంటారని.. ఇలాంటి ఆరోపణలకు ఆస్కారమే లేదని వారు అంటున్నారు. కూతురు వయసున్న ఆమె ఇలాంటి నింద వేయడం తగదని అంటున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు నిందవేసిన మహిళ సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కెవిబిపురం మండలానికి చెందిన తెలుగుదేశం నాయకురాలు. కోనేటి ఆదిమూలం తెదేపాలో చేరి ఇంచుమించుగా అయిదు నెలలు అయి ఉండొచ్చు. ఈ స్వల్ప వ్యవధిలోనే ఆమె చెప్పినన్ని వ్యవహారాలు జరిగిపోయాయా? అనేది కొందరికి కలుగుతున్న సందేహం.
అయితే సత్యవేడు నియోజకవర్గంలోని తెలుగుదేశంలో కోనేటి ఆదిమూలంకు వ్యతిరేకవర్గం ఉంది. చివరినిమిషంలో వైసీపీ నుంచి వచ్చి టికెట్ తన్నుకుపోయాడని ద్వేషిస్తున్నవారు ఉన్నారు. ట్విస్టు ఏంటంటే.. ఆ గ్రూపునకు వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఇలా కుమ్మక్కు అయిన నేతలు సదరు మహిళను ప్రయోగించి కోనేటి ఆదిమూలం క్రెడిబిలిటీ దెబ్బతీయాలని ప్రయత్నించినట్టు తెలుస్తోంద. అందుకు ప్రతిఫలంగా హైదరాబాదులో ఆమెకు మంచి లబ్ధి చేకూర్చేలా డీల్ కుదిరినట్టు కూడా నియోజకవర్గంలో వినిపిస్తోంది. మరి, చంద్రబాబు ప్రస్తుతానికి పార్టీనుంచి సస్పెండ్ చేశారు గానీ.. పోలీసు విచారణలో కోనేటి సచ్ఛీలత తేలితే.. ఆయన కూతుళ్లు చెబుతున్నట్టుగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.