అమరావతి అంటే అది దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. జైలుపాలైన జర్నలిస్టు కృష్ణంరాజుకు ఎట్టకేలకు బెయిలు లభించింది. సాక్షి ఛానెల్ నుంచి డబ్బులు తీసుకుంటూ.. వారి కళ్లలో ఆనందం చూడడానికి, వారికి నచ్చినట్టుగా మాట్లాడడం అలవాటు చేసుకున్న కృష్ణంరాజు.. పోలీసు విచారణలో అలా అనకుండా ఉండాల్సింది అంటూ విచారం వ్యక్తం చేసినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. మొత్తానికి ఆయనకు బెయిలు లభించింది. వారానికి ఓసారి స్టేషనుకు వచ్చి సంతకం చేసి వెళ్లాలని ఆదేశించారు. అయితే ఈ జర్నలిస్టు కృష్ణంరాజుకు బుద్ధి మారిందో లేదో ప్రపంచానికి తెలిసేదెలాగ? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
సాక్షి చానెల్ లో కెఎస్సార్ లైవ్ షోలో డిబేట్ నిర్వహించేప్పుడు ముందురోజే ఏ సబ్జెక్టుల మీద చర్చ ఉంటుందో దానికి అవసరమైన సమాచారం కొంత పంపుతారని.. కృష్ణం రాజు స్వయంగా పోలీసుల విచారణలో వెల్లడించారు. డిబేట్లలో గెస్టులు ఏం మాట్లాడాలో కూడా సాక్షి ప్లాన్ చేసి చెప్పించేదని తేలింది. అలాగే.. చంద్రబాబు వ్యతిరేక వ్యాఖ్యలు, విశ్లేషణలు తన యూట్యూబ్ చానెల్లో పెడుతున్నందుకు వైసీపీ నాయకులు తనకు డబ్బులు ఇస్తుంటారని కూడా కృష్ణంరాజు వెల్లడించారు.
అయితే పోలీసుల విచారణ సందర్భంగా ఆయన పశ్చాత్తాపం చెందినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. నిజానికి తన వ్యాఖ్యలు వివాదం సృష్టించిన తొలిరోజుల్లో మాత్రం ఆయన అదే తలబిరుసుతనంతో వ్యవహరించారు. ఒకవైపు పోలీసు కేసులు నమోదు అవుతుండగా.. మహిళలు రాష్ట్రమంతా నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. ఆయన మాత్రం.. పొగరుగా ఒక వీడియో విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. గుంటూరు- అమరావతి పరిధిలో సెక్స్ వర్కర్లు అరెస్టు అయిన సందర్భాల్లోని వేర్వేరు వార్తలను ఆయన క్లిప్పింగులు ప్రదర్శిస్తూ వీడియో పెట్టారు.
కానీ అరెస్టు అయిన తరువాత.. పోలీసు కస్టోడియల్ విచారణకు వచ్చేసరికి ఆయనలో కొంత మార్పు వచ్చినట్టు కనిపించింది. తాను తప్పు చేసినట్టుగా చెప్పిన ఆయన, జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత.. తన తప్పును దిద్దుకుంటూ మహిళలందరికీ క్షమాపణలు చెప్పుకుంటూ ప్రత్యేకంగా వీడియోలు చేసి పెడతానని పోలీసులతో అన్నట్టుగా వార్తలు వచ్చాయి. చంద్రబాబు మీద ద్వేషంతో అమరావతి మీద అలాంటి విష వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్నట్టు ఆయన అన్నారు. ఇప్పుడు ఆయనకు బెయిలు మంజూరైంది. ఇప్పుడు కూడా ఆయనలో అదే పశ్చాత్తాపం ఉందా? లేదా, పోలీసుల ఎదుట అలా నటించి.. బయటకు వచ్చాక మర్చిపోతారా? రాష్ట్రంలోని ప్రతి మహిళకు సారీ చెబుతూ వీడియో చేసి పెడతారా? లేదా? అనేది ఇప్పుడు వేచిచూడాలి.