‘ఒకే ఒక్క కుంభకోణం.. దాదాపు నాలుగేళ్లపాటు దోపిడీ.. ఏకంగా 3200 నుంచి 3500 కోట్ల రూపాయల
సొమ్ము స్వాహా! ఇలాంటి కుంభకోణంలో కీలక పాత్రధారికి బెయిలు ఇస్తే.. కేసు విచారణ ముందుకెలా వెళ్తుంది. ప్రజాప్రతినిధిగా ఉన్న హోదాను అడ్డు పెట్టుకుని.. అసలు విచారణకే రాకుండా.. ఒక్కొక్క నిందితుడూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే.. ఇక కేసులు తేలేదెప్పటికి? కాబట్టి బెయిలు ఇవ్వడానికి వీల్లేదు..’ అనే తరహా అభ్యంతరాలతోనే ఏపీ రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టులో కౌంటరు దాఖలు చేసింది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. మద్యం కుంభకోణంలో ముందస్తు బెయిలుకోసం సుప్రీం కోర్టును ఆశ్రయించి ఉన్న నేపథ్యంలో ఆయనకు అరెస్టునుంచి రక్షణ కల్పిస్తూ.. కేసు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు బెయిలు ఇవ్వరాదని, కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉన్నదని కోరుతూ ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయడం గమనార్హం.
మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రధాన పాత్రధారి. మొత్తం వ్యవహారానికి రూపకల్పన చేయడం దగ్గరినుంచి, నడిపించడంలో కూడా ఆయన కీలకం. ఆయన, మరికొందరు నిందితులు కలిసి మొత్తం మద్యం విధానాన్ని రూపురేఖలు మార్చేసి.. తాము తలచినంతగా, తలచిన విధంగా ముడుపులు కాజేయడానికి అనుకూలమైన విధానం రూపొందించారు. స్వాహా చేసిన సొమ్ములు చాలా వరకు నగదు, బంగారం రూపంలో అందుకున్నారు. ఇప్పటికే నమోదు చేసిన అనేకమంది సాక్షలు వాంగ్మూలాలు, సేకరించిన ఇతర ఆధారాలు, బ్యాంకు స్టేట్మెంట్ల వంటి లావాదేవీల వివరాలు అన్నీ కూడా ఈ తరహా నేరక్రమాన్ని నిర్ధరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయనకు బెయిలు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అనే విధంగా ప్రభుత్వం తమ కౌంటర్ లో అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
మద్యం కుంభకోణం విషయంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. తన పేరు ఏ రకంగానూ కేసులో లేని రోజులనుంచి అతిగా భయపడుతున్నారు. మద్యం కుంభకోణం మీద ప్రభుత్వం దృష్టి సారించడం అంటేనే.. తన అరెస్టుకు సంకేతం వచ్చినట్టేననేది ఆయన ప్రధాన భయం. అందుకే బెవరేజెస్మ కార్పొరేషన్ సిట్ విచారణలోతన పేరు ప్రస్తావించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడే ఆయన అతిగా కంగారు పడ్డారు. అప్పుడే హైకోర్టులో ముందస్తు బెయిలుకోసం పిటిషన్ వేశారు. కేసులో పేరు లేదు.. పోలీసులు సాక్షిగా రావాలని కూడా నోటీసులు ఇవ్వలేదు.. ఇంత కంగారు ఎందుకన్నట్టుగా కోర్టు బెయిలు పిటిషన్ తిరస్కరించింది. ఒకసారి రాజ్ కెసిరెడ్డి అరెస్టు అయినతర్వాత.. నిందితుల జాబితా మొత్తం మారింది. అదివరలో సాక్షిగా హాజరైన విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరూ కూడా ఈసారి నిందితులుగా ప్రమోట్ అయ్యారు. మిథున్ లో ఇంకా భయం పెరిగింది. ఆయన సుప్రీం కోర్టులో అభిషేక్ మను సింఘ్వి, నిరంజన్ రెడ్డి వంటి ప్రముఖ లాయర్లతో ముందస్తు బెయిలు పిటిషన్ నడుపుతున్నారు. ప్రభుత్వం కూడా సిద్ధార్థలూథ్రా, ముకుల్ రోహత్గీ వంటి ప్రముఖులతో వాదనలు వినిపిస్తోంది. ఇంత సీనియర్లు బెయిలు పిటిషను కోసం రావడం చూసి సుప్రీం న్యాయమూర్తులే దేశసరిహద్దుల్లో కూడా ఇంత ఉద్రిక్తత ఉండదని వ్యాఖ్యానించడం విశేషం. ఈ నేపథ్యంలో అసలు బెయిలు ఇవ్వరాదంటూ.. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటరు ఆసక్తికరంగా ఉంది. మరి కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో వేచిచూడాలి.