జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఆయన మంత్రి వర్గ సహచరుల్లో అంతో ఇంతో బుర్ర ఉన్న, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్న మంత్రుల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒకరు అని ఎరిగిన వారు చెబుతూ ఉంటారు. అందుకే.. జగన్మోహన్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని, ప్రభుత్వాన్ని ముంచేసే అనేక పథకాలను ప్రవేశపెడుతున్నప్పుడు అప్పట్లోనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన అభ్యంతరాలను కూడా చెబుతూ వచ్చారని కూడా అంటుంటారు.
అలాంటి బుగ్గన ఇప్పుడు పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి తన అమూల్యమైన అభిప్రాయాలు వెల్లడించారు. సొంత బుద్ధి, ఆలోచన ఉన్న బుగ్గన బడ్జెట్ గురించి తన సొంత అభిప్రాయాలే చెప్పారా? లేదా, వైసీపీ లోని ఇతర పార్టీ నాయకుల్లాగా తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్టును చదివివినిపించారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. బుగ్గన కూడా ఇంత మూర్ఖంగా మాట్లాడితే ఎలా అని వారు అంటున్నారు.
మేనిఫెస్టో అమలు చేస్తారని ఎదురుచూసిన వారికి నిరాశ కలిగించేలా ఈ బడ్జెట్ ఉన్నదట. మేనిఫెస్టో అనేది అయిదేళ్లకోసం ప్రభుత్వం ఇచ్చే హామీపత్రం. దానిని తొలి ఏడాదిలోనే పూర్తిచేసేయాలని ఎదురుచూసేవారు ఎవరుంటారు? బుగ్గన తప్ప.. అని జనం జోకులేసుకుంటున్నారు.
అలాగే గత ప్రభుత్వం కంటె 41 వేల కోట్ల ఎక్కువ ఖర్చు పెట్టేలా బడ్జెట్ ఉన్నదని, ఎలాంటి పథకాల అమలు లేకుండానే ఇంత బడ్జెట్ ఎందుకో అర్థం కావడంలేదని బుగ్గన అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఏలుబడి కాలంలో.. అసలు పథకాలు తప్ప ప్రభుత్వం ఒక్క పనికూడా చేసిన పాపాన పోలేదు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడం అంటే ఏమిటో అయిదేళ్లుగా ప్రజలు పూర్తిగా మరచిపోయారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం పోలవరం, అమరావతి సహా అనేక ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతుండగా.. డబ్బు ఖర్చు పెరగకుండా ఎలా ఉంటుంది? బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి మరీ అంత అమాయకంగా మాట్లాడితే ఎలా అనే ప్రజలు అనుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2.94 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు అని అర్థమవుతోంది. వారి అక్కసు బుగ్గన మాటల్లో కనిపిస్తోందని అంతా అనుకుంటున్నారు.